అంగన్వాడీలకు నోటీసులు.. 10రోజుల్లోగా సమాధానమివ్వకపోతే..!
నోటీసులు కూడా బయటకొచ్చాయి కాబట్టి మరోసారి బంతి ప్రభుత్వం కోర్టులోనే ఉంది. ఈలోగా వారిని బుజ్జగిస్తారా, లేక 10రోజుల తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాలి.
ఏపీలో అంగన్వాడీలకు నిన్న సాయంత్రం నుంచి నోటీసులు వెళ్తున్నాయి. ఎస్మా యాక్ట్ ప్రయోగించిన తర్వాత వారికిచ్చిన డెడ్ లైన్ పూర్తి కావడంతో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అత్యవసర విధుల్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 10రోజుల్లోగా వివరణతో కూడిన సమాధానం ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టరేట్ల నుంచి హడావిడి మొదలు..
కలెక్టరేట్ నుంచి ముందుగానే తహశీల్దార్ల ఆఫీసులకు ఆదేశాలొచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి అర్జంట్ గా నోటీసులివ్వాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ ల నుంచి నమూనాలు వస్తే, వాటిని రెవెన్యూ ఉద్యోగులు తీసుకెళ్లి సదరు అంగన్వాడీలకు నేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ అడ్రస్ ప్రకారం వారి ఇంటికి వెళ్లాలి, లేకపోతే అంగన్వాడీ సెంటర్ కు వెళ్లాలి. అక్కడ కూడా లేకపోతే వారి ఇంటికి, అంగన్వాడీ సెంటర్ కు నోటీసులు అతికించి రావాలి. ఇదీ నిన్న సాయంత్రం జిల్లా కేంద్రాలనుంచి అందిన ఆదేశాలు. మొత్తం మూడు రోజుల్లో అంగన్వాడీలందరికీ నోటీసులివ్వాలని పేర్కొన్నారు ఉన్నతాధికారులు.
అంగన్వాడీల నిర్ణయం ఏంటి..?
ఎస్మాకి తగ్గేది లేదన్నారు, నోటీసులిస్తున్నా బెదిరేది లేదంటున్నారు. కేవలం ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఉద్యమం ఇంత గట్టిగా జరుగుతుందనుకోలేం. ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం తమపై దయచూపిస్తుందనే ఒకే ఒక్క నమ్మకంతోనే అంగన్వాడీలు రోడ్డెక్కారు. ప్రతి రోజూ నిరసనల హోరు చూపిస్తున్నారు. ఇంతదూరం వచ్చాక, ఎస్మాకు భయపడితే భవిష్యత్తులో నోరు తెరిచి అడిగే అవకాశం ఉండదనేది వారి ఆలోచన. అందుకే తాడోపేడో తేల్చుకోడానికే వారు రెడీ అయ్యారు. నోటీసులు కూడా బయటకొచ్చాయి కాబట్టి మరోసారి బంతి ప్రభుత్వం కోర్టులోనే ఉంది. ఈలోగా వారిని బుజ్జగిస్తారా, లేక 10రోజుల తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాలి.