Telugu Global
Andhra Pradesh

కేంద్రంలో వైసీపీ ఎంపీ వంగా గీతకు కీలక పదవి

వైసీపీ కాకినాడ ఎంపీ వంగా గీతకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా)లో సభ్యురాలిగా గీతను నియమించారు.

YSRCP MP Vanga Geetha appointed as mpeda member
X

వైసీపీ కాకినాడ ఎంపీ వంగా గీతకు కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా)లో సభ్యురాలిగా గీతను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో మత్స్య సంపద పెరుగుదలకు ఎంపెడా కృషి చేస్తోంది. ఇటీవల స్వర్ణోత్సవాలు జరుపుకున్న ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా ఎంతో మంది మత్య్సకారులకు, వ్యాపారులకు అండగా ఉంటోంది.

ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నది. ఎంతో మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో విభిన్న జాతుల ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి ఎంపెడా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. ముఖ్యంగా ఏపీలో ప్రత్యామ్నాయ జాతుల పెంపకంపై ఈ సంస్థ కృషి చేస్తోంది. ఏడు దశాబ్దాలుగా మత్స్యసంపదను 18 రెట్లు పెంచడంలో ఎంపెడది ఎనలేని పాత్ర.

ఇప్పుడు ఆ సంస్థలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి సభ్యురాలు కావడం మరింత లాభం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంత మత్య్సకార కుటుంబాలకు ఎంతో మేలు చేసే అవకాశం దొరుకుతుంది. వంగా గీతకు కేంద్ర సంస్థలో పదవి దక్కడంతో వైసీపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.

వంగ గీతకు పలువురు పార్టీ ఎంపీలు అభినందనలు తెలిపారు. ఎంపెడా సభ్యురాలిగా వంగా గీతకు అవకాశం దక్కడంపై ఎంపీ విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆమె సభ్యురాలు కావడం వల్ల ఏపీలో సముద్ర ఉత్పత్తుల అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. కాకినాడలో 150 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర ప్రాంతానికి మరింత లబ్ది చేకూరుతుందని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.





First Published:  3 Aug 2022 4:45 PM IST
Next Story