Telugu Global
Andhra Pradesh

రాజధానుల బిల్లు ఉంటుందా? ఉండదా? చివరి రోజు సీఎం జగన్ ఆశ్చర్యపరుస్తారా?

హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడితే కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయవచ్చని నిపుణులు వాదిస్తున్నారు. అయితే, తాను అనుకున్నది సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లే సీఎం వైఎస్ జగన్.. రాజధానుల బిల్లు విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని అంటున్నారు.

రాజధానుల బిల్లు ఉంటుందా? ఉండదా? చివరి రోజు సీఎం జగన్ ఆశ్చర్యపరుస్తారా?
X

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మూడు రాజధానుల అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాజధానుల అంశంపై చర్చ ప్రారంభించగా కొడాలి నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు విషయాలు మాట్లాడారు. పాలన వికేంద్రీకరణకే మూడు రాజధానుల బిల్లు అని చెబుతున్నా.. బిల్లు పెడతారా లేదా అనే విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ రాలేదు. రాజధాని అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ నాయకులు వేలాది ఎకరాల ముందుగానే కొని పెట్టుకున్నారని వైసీపీ ఆరోపించింది.

మూడు రాజధానులకే వైసీపీ కట్టుబడి ఉందని, ఈ సారి తప్పకుండా బిల్లు ప్రవేశపెడతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పలు మార్లు బయట వ్యాఖ్యానించారు. తీరా అసెంబ్లీ సెషన్ మొదలైన తర్వాత ఏ ఒక్కరు కూడా బిల్లు గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చర్చ ముగించే సమయంలో పాలన వికేంద్రీకరణే మా విధానమని చెప్పినా.. బిల్లు పెడుతున్నట్లు సూచన ప్రాయంగా కూడా మాట్లాడకపోవడంతో మూడు రాజధానులపై సస్పెన్స్ కొనసాగుతోంది. వాస్తవానికి మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు డ్రాఫ్ట్ సిద్ధం అయ్యింది. కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని సభలో ప్రవేశ పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే రెండు సార్లు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓ సారి శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపినా.. ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోకుండా అసెంబ్లీలో ఆమోదింప చేశారు. గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినా.. చివరకు న్యాయపరమైన చిక్కులు రావడంతో హైకోర్టులో విచారణ జరుగుతుండగానే బిల్లును వెనక్కు తీసుకున్నారు. అమరావతి రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు కూడా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వచ్చింది. ఇన్ని చిక్కుల మధ్య మరోసారి రాజధాని బిల్లును ప్రవేశపెడితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడితే కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయవచ్చని నిపుణులు వాదిస్తున్నారు. అయితే, తాను అనుకున్నది సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లే సీఎం వైఎస్ జగన్.. రాజధానుల బిల్లు విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉందని అంటున్నారు. కోర్టుల్లో మూడు రాజధానుల బిల్లు నిలబడుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ముందుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. శాసన సభను ఐదు రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే బీఏసీ నిర్ణయించింది. చివరి రోజు అనూహ్యంగా సీఎం జగన్ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదముద్ర వేయించుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొదటి రోజు కేవలం చర్చ జరిగినా.. చివరి రోజు మాత్రం తన మాటకు కట్టుబడి.. బిల్లు పెడతారనే ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

First Published:  16 Sept 2022 6:30 AM IST
Next Story