టిక్ టాక్ ప్రేమ కథ ఇట్లుంటది మరి..! భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
తన భర్తకు ప్రియురాలితో వివాహం చేసింది ఓ యువతి. ఈ సంఘటన తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో సంచలనం సృష్టించింది. డక్కిలికి చెందిన కళ్యాణ్ టిక్ టాక్ లో వీడియోలు చేసే వాడు.
తన భర్తకు ప్రియురాలితో వివాహం చేసింది ఓ యువతి. ఈ సంఘటన తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో సంచలనం సృష్టించింది. డక్కిలికి చెందిన కళ్యాణ్ టిక్ టాక్ లో వీడియోలు చేసే వాడు. అతడికి టిక్ టాక్ లో వీడియోలు చేసే విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ తో పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి కళ్యాణ్ కు టిక్ టాక్ లోనే వీడియోలు చేసే కడపకు చెందిన విమల పరిచయం అయ్యింది. వీరి పరిచయం కూడా ప్రేమ దాకా వెళ్లింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.
వీరి కాపురం సజావుగా సాగుతుండగా విశాఖపట్టణానికి చెందిన నిత్యశ్రీ కళ్యాణ్ వద్దకు వచ్చింది. అతడికి పెళ్లి జరిగిందని తెలుసుకుని బాధపడింది. కళ్యాణ్ ని విడిచిపెట్టి ఉండలేనని.. ఇక్కడే ఉండిపోతానని..ఎలాగైనా తామిద్దరినీ ఒక్కటి చేయాలని విమలను వేడుకుంది. ముగ్గురం కలిసి ఉందామని కోరింది. నిత్యశ్రీ బాధ చూసిన విమల కరిగిపోయింది.
నిత్యశ్రీ మాటలు ముందు షాక్ కు గురిచేసినా ఆ తర్వాత ముగ్గురు కలిసి ఉండేందుకు ఆమె అంగీకరించింది. బుధవారం దగ్గర ఉండి తానే తన భర్తకు, అతడి ప్రియురాలికి పెళ్లి జరిపించింది. నిత్యశ్రీ కి పెళ్ళికూతురి అలంకరణ కూడా స్వయంగా చేసింది. పెళ్లి పీటల వద్ద పెద్దగా వ్యవహరించి వివాహాన్ని జరిపించింది. భార్య దగ్గర ఉండి భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన సంఘటన డక్కిలిలో సంచలనం సృష్టిస్తోంది.
అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగింది..అనే విషయం బయటికి రాలేదు. కాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆలస్యంగా బయటకు రాగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమల ఏమీ ఆలోచించకుండా పిచ్చి పని చేసిందో, త్యాగం చేసిందో అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఎటువంటి గొడవలు లేకుండా ముగ్గురూ కలిసి జీవించాలని సూచిస్తున్నారు. ఈ టిక్ టాక్ ప్రేమ కథ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.