Telugu Global
Andhra Pradesh

టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ నెంబర్ వన్ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

దేశంలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెలీ మెడిసిన్ సేవలు అత్యంత మెరుగ్గా ఉండటమే కాకుండా, అందరి కంటే ముందున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ నెంబర్ వన్ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
X

సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. దేశంలో టెలీ మెడిసిన్ సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1గా నిలిచింది. ఆరోగ్య అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు, మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ అందిస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత టెలీ మెడిసిన్‌కు సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేశారు. మారుమూల ప్రాంతాలకు సైతం ఫోన్ ద్వారా స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1.86 కోట్ల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారు.

దేశంలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెలీ మెడిసిన్ సేవలు అత్యంత మెరుగ్గా ఉండటమే కాకుండా, అందరి కంటే ముందున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో 'ఈ-సంజీవని' టెలీ మెడిసిన్ ద్వారా గ్రామాల్లో స్పెషలిస్టు వైద్య సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 6.03 కోట్ల మంది టెలీ మెడిసిన్ సేవలు పొందగా.. కేవలం ఏపీలోనే 1.86 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా టెలీ మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు వైద్య సేవలు అందుకుంటున్న వారిలో 30.84 శాతం మంది ఏపీలోనే ఉన్నట్లు పార్లమెంటులో వెల్లడించారు. ఏపీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 86.69 లక్షల మంది, తమిళనాడులో 67.22 లక్షల మంది టెలీ మెడిసిన్ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.


First Published:  20 Feb 2023 2:42 PM IST
Next Story