Telugu Global
Andhra Pradesh

తమిళ బాటలో ఏపీ రాజకీయాలు

తమిళనాడు రాజకీయాలంటే ఇప్పుడు కాదు. ఒకప్పుడు అంటే డీఎంకే అధినేతగా కరుణానిధి, ఏఐఏడీఎంకే అధినేతగా జయలలిత ఉన్నప్పటి సంగతి. వీళ్ళిద్దరూ ఒక‌రి మీద మ‌రొక‌రు రెగ్యులర్‌గా అవినీతి ఆరోపణలు చేసుకోవటం కేసులు పెట్టి జైలుకు పంప‌డం చాలా మందికి తెలిసిందే.

తమిళ బాటలో ఏపీ రాజకీయాలు
X

తమిళనాడు బాటలోనే ఏపీ రాజకీయాలు ప్రయాణిస్తున్నట్లున్నాయి. తమిళనాడు రాజకీయాలంటే ఇప్పుడు కాదు. ఒకప్పుడు అంటే డీఎంకే అధినేతగా కరుణానిధి, ఏఐఏడీఎంకే అధినేతగా జయలలిత ఉన్నప్పటి సంగతి. వీళ్ళిద్దరూ ఒక‌రి మీద మ‌రొక‌రు రెగ్యులర్‌గా అవినీతి ఆరోపణలు చేసుకోవటం కేసులు పెట్టి జైలుకు పంప‌డం చాలా మందికి తెలిసిందే. ఒకసారి అయితే జయలలిత అధికారంలో ఉండగా కరుణానిధిని అర్ధరాత్రి జైలులోకి నెట్టింది. కరుణానిధి ఇంట్లోకి పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి నిద్రపోతున్న కరుణానిధిని ఎత్తుకుని బయటకు లాక్కొచ్చి మరీ జైలులోకి తోశారు.

ఆ తర్వాత కరుణానిధి సీఎం అయిన తర్వాత జయలిలతను జైలుకు పంపారు. అలాంటి రాజకీయాలే ఇప్పుడు ఏపీలో కూడా మొదలవుతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు అరెస్టులన్నీ ఎమ్మెల్యేలు, కిందస్థాయి నేతల వరకే పరిమితమయ్యాయి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎమ్మెల్యేలను, చాలామంది నేతలను అరెస్టులు చేయించారు. ఇప్పుడు వైసీపీ హయాంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులు జరుగుతున్నాయి. చంద్రబాబుతో పాటు మరి కొందరి మీద అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కేసులు పెట్టి విచారణ చేస్తోందే కానీ అర్ధరాత్రి అరెస్టులు చేయలేదు.

ఆ పరిస్ధితి దాటిపోయి ఇప్పుడు పార్టీ అధినేతల మీద కోర్టులో పరువు నష్టం దావా వేసే దాకా పరిస్థితి వెళ్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదై జైలుకు పంపినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటిది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ప్రభుత్వం పరువు నష్టం కేసు నమోదు చేయమని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్‌ను ఆదేశించింది. ఎందుకంటే రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని నిరాధార‌ ఆరోపణలు చేశారని.

16 వేల మంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వటానికి వలంటీర్లే కారణమని పవన్ పదేపదే ఆరోపిస్తున్నారు. పైగా తనకు ఈ సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయని పవన్ చెప్పటం మరీ విచిత్రంగా ఉంది. అసలు కేంద్ర నిఘా వర్గాలు ఏ హోదా ఉందని పవన్‌కు చెప్పాయో ఎవరికీ అర్థంకావటం లేదు. మొత్తం మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ కోర్టులో కేసు వేసి అరెస్టుకు అనుమతి తీసుకుంటే ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగటం ఖాయం.

First Published:  22 July 2023 2:30 PM IST
Next Story