Telugu Global
Andhra Pradesh

అది జనసేన కాదు.. కమ్మసేన..

భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతోందని, కానీ టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్రం రాలేదని రెండురోజుల క్రితం పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చిన మంత్రి అమర్నాథ్.. తాజాగా జనసేనను కమ్మసేన అంటూ మండిపడ్డారు.

అది జనసేన కాదు.. కమ్మసేన..
X

భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతోందని, కానీ టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్రం రాలేదని రెండురోజుల క్రితం పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చిన మంత్రి అమర్నాథ్.. తాజాగా జనసేనను కమ్మసేన అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ది కాపు జనసేన కాదని, అది కమ్మ జనసేన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాపులెవరూ పవన్ కల్యాణ్‌ ను నమ్మటం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు స్క్రిప్ట్, ప్రొడక్షన్ అన్నీ చంద్రబాబు చూసుకుంటున్నారని, దర్శకత్వ బాధ్యతలు మాత్రం నాదెండ్ల మనోహర్‌ కి అప్పగించారని.. అలా కమ్మల చేతుల్లో అన్ని బాధ్యతలు పెట్టిన పవన్ కల్యాణ్ ది కమ్మ జనసేన కాక ఇంకేంటని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.

ఏ పార్టీతో ఉన్నావు పవన్..

అసలు పవన్‌ కల్యాణ్ బీజేపీతో కలసి ఉన్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్. ప్రధాని మోదీ దగ్గర వేషాలు వేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని, ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్పుకునే పవన్, టీడీపీకి లాభం చేకూర్చే పనులు చేయడానికి రెడీగా ఉంటారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చేలా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారని, ఓట్లు చీలనివ్వబోనంటూ తన అసలు రంగు బయటపెట్టుకున్నారని మండిపడ్డారు.

వెయిట్ లాస్ కాదు, మైండ్ లాస్..

లోకేష్ కు వెయిట్ లాస్ పేరుతో ట్రీట్ మెంట్ ఇప్పిస్తే ఆయనకు మైండ్ లాస్ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. తాము అధికారంలో లేకపోతే రాష్ట్రంలో ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో తండ్రీకొడుకులు ఉంటారని, తాము ప్రారంభిస్తున్న కంపెనీలన్నిటికీ చంద్రబాబు గతంలోనే ప్రారంభోత్సవం చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏకహోమా సంస్థ ప్రతినిధులు మాట్లాడిన అంశాలు ప్రతిపక్షాలు వినాలని డిమాండ్ చేశారు. 30నెలల సమయంలో ఏర్పాటు చేయాల్సిన కంపెనీని కేవలం 15 నెలల్లోనే ఏర్పాటు చేశారని, దానికి వైసీపీ ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, అందుకే ఆ కంపెనీ ప్రతినిధులు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు మంత్రి అమర్నాథ్.

First Published:  17 Aug 2022 2:57 PM IST
Next Story