జనవాణి కార్యక్రమం అంటే ప్రభుత్వం భయపడుతోందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. సందర్భం ఏదైనా లేదా అసందర్భంగానే జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడంలో, ఆరోపణలు చేయటంలో ముందుంటారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. సందర్భం ఏదైనా లేదా అసందర్భంగానే జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడంలో, ఆరోపణలు చేయటంలో ముందుంటారు. అయితే ఆరోపణలు చేయటంలో పూర్తిగా లాజిక్ మరచిపోతారు. ఇపుడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతు పవన్ చేసిందిదే. మీడియాతో పవన్ మాట్లాడుతు జనవాణి కార్యక్రమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. తమ కార్యక్రమానికి వస్తున్న జనాధరణ చూసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఇక్కడే పవన్ ఆరోపణల్లో పసలేదని తేలిపోతోంది. ఎందుకంటే జనవాణి కార్యక్రమం ఇదే మొదలుకాదు. ఇప్పటికే ఐదు ప్రాంతాల్లో పవన్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఐదుప్రాంతాల్లోను ప్రభుత్వం జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోలేదే ? పవన్ను కాదు కదా చివరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే జనాలను కూడా అడ్డుకోలేదు. పవన్ కార్యక్రమాలు పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది ?
ఇప్పటివరకు జనసేన ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకోలేదన్న విషయం అందరికీ తెలుసు. ఇన్ని కార్యక్రమాలు సజావుగా జరిగిపోయినపుడు వైజాగ్ లో కార్యక్రమాన్ని మాత్రమే అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది ? అంటే పవన్ తో మొదటినుండి పెద్ద సమస్యుంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చిన్నచూపు. ఇదే సమయంలో తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. అలాగే ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్ తో పాటు సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా పవన్లో పెరిగిపోతున్నట్లుంది. ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని అని తనకు తానే గతంలో సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన రెండునియోజకవర్గాల్లోను ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ అక్కసంతా జగన్ మీద డైరెక్టుగా చూపిస్తుంటారు. జనవాణి మొదటి కార్యక్రమంలోనే పవన్ చెప్పిందేమంటే తనకు వచ్చే అర్జీలన్నింటినీ ప్రభుత్వ శాఖలకు పంపటం తప్ప తానేం చేయలేనని. అర్జీలను ప్రభుత్వానికి పంపటం తప్ప ఏమి చేయలేనని ఒప్పేసుకున్న పవన్ అంటే ఇక ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది ?