చేపల ఉత్పత్తిలో ఏపీ టాప్.. - దేశ ఎగుమతుల్లో మూడో వంతు ఏపీ నుంచే
చేపల ఉత్పత్తిలో 2021-22 జాతీయ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రెట్టింపు వృద్ధి రేటును ఏపీ సాధించింది. జాతీయస్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా, ఏపీలో వృద్ధి రేటు 12.57 శాతంగా నమోదు కావడం విశేషం.
చేపల ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2021-22లో దేశంలో చేపల ఉత్పత్తిలో 30.82 శాతం ఏపీ నుంచే కావడం గమనార్హం. దీంతో పాటు ఎగుమతుల్లో 35 శాతం వాటాను ఆక్రమించింది. చెరువులు, కాలువల వంటి నీటి వనరుల్లో (ఇన్‌ల్యాండ్) 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ ఈ ఘనత సాధించింది. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ 16.52 లక్షల టన్నులు, ఉత్తర ప్రదేశ్ 8.09 లక్షల టన్నులు, ఒడిశా 7.89 లక్షల టన్నులు, బీహార్ 7.62 లక్షల టన్నులతో వరుసగా నిలిచాయి. సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో మాత్రం ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 7.02 లక్షల టన్నులతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా, కేరళ 6.01, తమిళనాడు 5.95 లక్షల టన్నులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఏడాది వ్యవధిలో రెట్టింపు వృద్ధి రేటు..
చేపల ఉత్పత్తిలో 2021-22 జాతీయ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రెట్టింపు వృద్ధి రేటును ఏపీ సాధించింది. జాతీయస్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా, ఏపీలో వృద్ధి రేటు 12.57 శాతంగా నమోదు కావడం విశేషం. మన దేశంలోని 20కి పైగా రాష్ట్రాల్లో ఏపీలో ఉత్పత్తి అవుతున్న చేపలకే డిమాండ్ అధికంగా ఉంది. ఏపీలో ఉత్పత్తయ్యే చేపల్లో 20 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. 2021-22లో 48.13 లక్షల టన్నుల ఉత్పత్తితో రూ.59,188 కోట్ల జీవీఏ (జోడించబడిన స్థూల విలువ) సాధించడం గమనార్హం.
ఎగుమతుల్లోనూ ఏపీ హవా..
సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఏపీ హవా కొనసాగుతోంది. 2020-21లో దేశవ్యాప్తంగా రూ.43,717 కోట్ల విలువైన 11.49 లక్షల టన్నులు ఎగుమతి కాగా.. ఒక్క ఏపీ నుంచే రూ.15,882 కోట్ల విలువైన 2.80 లక్షల టన్నుల సముద్ర మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇక.. 2021-22లో దేశవ్యాప్తంగా రూ.57,586 కోట్ల విలువైన 13.69 లక్షల టన్నులు ఎగుమతి కాగా.. ఏపీ నుంచి రూ.20,020 కోట్ల విలువైన 3.24 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. ఈ కారణంగానే 2021-22 సంవత్సరానికి గాను బెస్ట్ మారిటైం స్టేట్ అవార్డును ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది.
సీఎం సంస్కరణల వల్లే..
సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు, అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే రాష్ట్రంలో మత్స్యరంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. 2022-23లో కూడా రికార్డు స్థాయి ఉత్పత్తి, ఎగుమతులతో కొత్త రికార్డులు నెలకొల్పబోతున్నట్టు ఆయన తెలిపారు.