Telugu Global
Andhra Pradesh

జగన్‌ చొరవ.. ఈ విషయంలో ఏపీ దేశంలోనే టాప్‌

ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేందుకు జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

జగన్‌ చొరవ.. ఈ విషయంలో ఏపీ దేశంలోనే టాప్‌
X

ప్రజలకు కావాల్సిందేమిటో, వారు మెరుగైన జీవితాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకుంటారో తెలిసిన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. విద్య, వైద్యం ప్రజాజీవితంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటిపై దృష్టిపెట్టి ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు, పేదలు ఇబ్బంది పడకుండా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రజలకు వైద్యచికిత్స ఇంటి ముంగిట్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజారోగ్యంపై జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించింది.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్షవంటి విప్లవాత్మమైన కార్యక్రమాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు చేరువ చేశారు. ఈ క్రమంలోనే జంట జబ్బులైన మధుమేహం, రక్తపోటు బాధితుల్లో 84 శాతం మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కాలానుగుణంగా మందులు అందిస్తూ ఇతర చికిత్సలు కూడా చేపడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఆ జంట జబ్బుల నిలువరింతలో ప్రథమ స్థానం సంపాదించుకుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది షుగర్‌, బీపి జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో 24 శాతం మంది మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపిలో 84 శాతం మంది వైద్య సంరక్షణలో ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్జానంలో ఉంది.

ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేందుకు జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్‌సి) డాక్టర్లు నెలలో రెండు రోజుల పాటు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి సచివాలయాలవారీగా దీర్ఘకాలిక రోగాల బారిన పడినవారి వివరాలను మ్యాప్‌ చేసిన వారికి సకాలంలో, సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయా, లేదా... మందులు ఇస్తున్నారా, లేదా తెలుసుకోవడానికి పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.

నాన్‌ కమ్యూనికేబుల్‌ డిజీసెస్‌ (ఎన్‌సిడీ) బాధితుల కోసం ఫాలో అప్‌ వైద్య సేవల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అందుకు వైద్య శాఖ ఓ డాష్‌ బోర్డును ఏర్పాటు చేసింది, ఏదైనా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలోని బాధితులందరికీ వైద్యం చేశాడా లేదా అనే విషయాన్ని డాష్‌ బోర్దు ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్‌ క్లినిక్స్‌లో బిఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన సిహెచ్‌వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్‌లో టెలీ మెడిసిన్‌ సౌకర్యం కూడా ఉంది. దాంతో అవసరమైనప్పుడు హబ్‌లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు.

First Published:  31 Jan 2024 5:00 PM IST
Next Story