టమాటా రైతుకు ఇక ఊరట..! - ప్రాసెసింగ్ యూనిట్లతో 30 శాతం అదనపు ఆదాయం
మొత్తం 20 యూనిట్ల ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అందులో తొలి దశలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుండగా, వాటి ద్వారా 3,300 మంది రైతులకు లబ్ధి కలగనుంది.
టమాటా రైతును ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. రాయలసీమలో 20 ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే 4 యూనిట్లు పూర్తిచేసింది. ఈ నెలాఖరు నుంచి అవి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 16 యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా దళారుల ప్రమేయం లేకుండా రైతుకు మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూరుతుంది.
అత్యధిక సాగు రాయలసీమలోనే..
రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతోంది. వాటిలో ఒక్క రాయలసీమలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి. ఏటా 26.16 లక్షల టన్నుల టమాటా దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. మూడున్నరేళ్లుగా మార్కెట్‌లో ధరలు తగ్గిన ప్రతిసారీ ప్రభుత్వం జోక్యం చేసుకుని.. వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాయలసీమ జిల్లాల్లో 20 ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నడుం బిగించింది. `ఆపరేషన్ గ్రీన్స్` ప్రాజెక్టు కింద చిత్తూరు, అన్నమ్మయ్య, సత్యసాయి జిల్లాల్లో ఈ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఒక్కో యూనిట్ రూ.3 కోట్ల అంచనా వ్యయంతో..
ఒక్కో యూనిట్‌ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేస్తారు. ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించేందుకు అవకాశముంటుంది. మరోపక్క ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను అనుసంధానం చేస్తున్నారు. లీఫ్ అనే కంపెనీతో ఇప్పటికే ఒప్పందం కూడా జరిగింది.
రైతుకు రవాణా, కమీషన్ వ్యయం మిగులు..
సాధారణంగా రైతులు తమకు వచ్చే ఆదాయంలో 10 నుంచి 20 శాతం వరకు.. పంటను మార్కెట్‌కు తరలించేందుకు అయ్యే రవాణా, కమీషన్ ఖర్చుల రూపంలోనే కోల్పోతుంటారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు అవకాశముంటుంది. వీటన్నింటి వల్ల రైతుకు మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా లబ్ధి చేకూరుతుంది.
నిర్వహణ బాధ్యత రైతు ఉత్పత్తిదారుల సంఘాలకే..
యూనిట్ల నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకే అప్పగిస్తున్నారు. వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ విధంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్ బాధ్యతలను లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనున్నాయి.
20 వేల మంది టమాటా రైతులకు లబ్ధి..
మొత్తం 20 యూనిట్ల ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అందులో తొలి దశలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి రానుండగా, వాటి ద్వారా 3,300 మంది రైతులకు లబ్ధి కలగనుంది. తొలిదశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లెతో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనం గుంటలో యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్న మండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వి.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్‌పేట, చెల్దిగనిపల్లె యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి. ఈ యూనిట్ల ద్వారా రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా లాభాలు ఆర్జించే అవకాశముంటుందని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి తెలిపారు.