కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పీఆర్సీపైనా నిర్ణయం
ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రులు కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ 2014 జూన్ 2న నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. జనవరిలోపే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు. కొత్త పీఆర్సీపైనా వచ్చే కేబినెట్ భేటీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో 16 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గ్యారెంటీ పించన్ స్కీంలో మెరుగైన అంశాలను చేర్చి అమలు చేస్తామన్నారు.
గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచుతున్నట్టు చెప్పారు. వర్షిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును కూడా 62ఏళ్లకు పెంచుతామన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీ చైర్మన్‌గా మాజీ సీఎస్ సమీర్ శర్మ పేరును మంత్రులు ప్రతిపాదించారు. అయితే సమీర్ శర్మ వద్దని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ భేటీలో 12వ పీఆర్సీ ప్రకటనపై నిర్ణయం ఉంటుందని బొత్స వివరించారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు.