చేరమంటే సుధీర్‌కి కోపం.. చేరొద్దంటే నాయుడికి రోషం
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వి నాయుడు వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీలో లోకేష్ యువగళం జోష్ నింపిందని కేడర్ సంబరపడుతున్నారు. లీడర్లు మాత్రం తమ సీట్లకి కొత్త చేరికలతో ఎక్కడ ఎసరు వస్తుందోననే టెన్షన్‌లో ఉన్నారు. తాజాగా శ్రీకాళహస్తి టిడిపిలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీలో ఓ చేరిక ఈ వివాదానికి కేంద్రబిందువైంది. తెలుగుదేశం పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుంటామంటే టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి కోపం. చేరొద్దంటే మాజీ ఎమ్మెల్యే నాయుడికి రోషం. ఎటువైపు మొగ్గు చూపాలే, ఇద్దరినీ ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక టిడిపి అధిష్టానం తల పట్టుకుంది.
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వి నాయుడు వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఆహ్వానించనున్నారు. మాజీ ఎమ్మెల్యే నాయుడు చేరికను బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సివి నాయుడుతో పాటు టిడిపి లీడర్లు ఎవరూ అమరావతికి వెళ్ళరాదు అంటూ పార్టీ గ్రూపులలో వాయిస్ మెసేజులను బొజ్జల సుధీర్ రెడ్డి పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు నాయుడుతో వెళ్లి చంద్రబాబునాయుడుని కలవాలా? వద్దా తేల్చుకోలేక శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు డైలమాలో పడ్డారు.
పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనను సంప్రదించకుండా ఎస్సీవీ నాయుడు టిడిపిలో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారని, ఆయన చేరిక గురించి పార్టీ ముఖ్యులు ఎవరూ కూడా తనతో మాట్లాడలేదని వాట్సప్ గ్రూపులలో బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో మెసేజ్ ఫార్వార్డ్ చేయడంతో గందరగోళం మొదలైంది. తన ఆదేశాలు కాదని నాయుడితో ఎవరన్నా అమరావతి వెళితే వ్యవహారం మరోలా ఉంటుందని వాయిస్ మెసేజులో బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టిడిపి ఓడిపోయిన తరువాత కూడా గ్రూపు గొడవలు తగ్గలేదు. బొజ్జల సుధీర్ రెడ్డిని టిడిపిలో ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు టిడిపిలో చేరిక అసమ్మతివర్గం మరింత బలం పుంజుకుంటుందనే ఆందోళన సుధీర్ రెడ్డిలో నెలకొనడంతోనే ఈ బెదిరింపులకి దిగారని తెలుస్తోంది.