పోరు ఉధృతమన్న బొప్పరాజు.. పోరాటమే అక్కర్లేదన్న ఎన్‌జీవో సంఘం
11వ పీఆర్సీ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ప్రభుత్వమే ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు మధ్య గ్యాప్ సృష్టించిందని ఆరోపించారు.
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం క్లారిటీతోనే ఉంది. కానీ, ప్రభుత్వ వైఖరిపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ఉద్యోగ సంఘాల్లోనే స్పష్టత లేదు. ఒక్కో సంఘం ఒక్కోలా పరిస్థితిని అర్థం చేసుకుంటోంది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. అటు ఏపీఎన్‌జీవో సంఘం మాత్రం అసలు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం అక్కర్లేదని తీర్మానించింది.
శ్రీకాకుళంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ప్రసంగించిన బొప్పరాజు.. ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించినట్టుగా మరే ప్రభుత్వానికి సహకరించలేదని చెప్పారు. దాన్ని ఉద్యోగుల చేతగానితనంగా తీసుకోవద్దని కోరారు. 11వ పీఆర్సీ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ప్రభుత్వమే ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు మధ్య గ్యాప్ సృష్టించిందని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు తిరుగుతూ ఉంటాయని.. ఈ ప్రచారం కోసం ఆ పార్టీ కార్యాలయంలో 3వేల మంది పనిచేస్తున్నారని బొప్పరాజు ఆరోపించారు.
టీచర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని చిక్కీలు కనిపించలేదని, కోడిగుడ్డు కుళ్లిపోయిందని, ఇలాంటి చిన్నచిన్న కారణాలతో సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను బెదిరించేందుకే ఏసీబీ దాడులు చేయిస్తున్నారని.. చివరకు తాజాగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బొప్పరాజు ప్రకటించారు.
అయితే అదే రోజు ఏపీఎన్‌జీవో సంఘం మరోలా స్పందించింది. మంగళవారం ఏపీఎన్‌జీవో కార్యనిర్వాహక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం లేదని తీర్మానించారు. కొన్ని సంఘాలు ప్రస్తుతం కేవలం తమ ఉనికి నిలుపుకునేందుకే పోరాటాలు చేస్తున్నాయని, వారి వెనుక ఉద్యోగులు పెద్దగా లేరని అభిప్రాయపడింది. 13 జిల్లాల ఎన్‌జీవో అధ్యక్షులు ఈ భేటీకి రాగా.. కేవలం ముగ్గురు మాత్రమే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారని ఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రకటించారు. మెజారిటీ సభ్యులు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడలేదు కాబట్టి పోరాటం అక్కర్లేదని తీర్మానిస్తున్నట్టు ప్రకటించారు. పీఆర్‌సీ కమిటీ ఏర్పాటుకు జూలై వరకు సమయం ఉందని అప్పటి వరకు వేచి ఉండడమే మంచిదని ఎన్‌జీవో సంఘం నిర్ణయించుకుంది.