రెమాల్ తుఫాన్, రోహిణీకార్తె.. భరించలేని ఉక్కపోతకు కారణాలివే
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు చుక్కలను తాకుతున్నాయి. మరోవైపు భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. స్నానం చేసి వస్తే బట్టలు వేసుకునేలోగానే చెమటలు ధారాపాతంగా కారిపోతున్న పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు చుక్కలను తాకుతున్నాయి. మరోవైపు భరించలేని ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. స్నానం చేసి వస్తే బట్టలు వేసుకునేలోగానే చెమటలు ధారాపాతంగా కారిపోతున్న పరిస్థితి. ఓ పక్క రోహిణీ కార్తె, మరోపక్క నిన్న రాత్రి తీరం దాటిన రెమాల్ తుఫాన్ ప్రభావం వల్లనే ఇదంతా అని వాతావరణ శాఖ ప్రకటించింది.
6 నుంచి 9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత
రెమా తుపాను ఆదివారం అర్ధరాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుపాను ప్రభావిత వాతావరణ మార్పులకు తోడు రోహిణీ కార్తె కూడా రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.
మరో 2 డిగ్రీలు పెరగొచ్చు
రోహిణీ కార్తె ఎండ అంటే రాళ్లు కూడా పగులుతాయి అంటారు. అంత ఎండ ప్రస్తుతానికి లేకపోయినా రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరో 2 డిగ్రీలు కనీసం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
బయట తిరగొద్దు
తీక్షణమైన ఎండ లేదు కాబట్టి బయటికి వెళ్లినా ఏం కాదు అనుకోవద్దని, ఇలా మబ్బుగా కనిపించినా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో శరీరంలో నీరంతా చెమట రూపంలోకి బయటికి పోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఎండల్లో తిరిగితే సాయంత్రానికి నిస్సత్తువ ఆవరిస్తుందని, ద్రవ రూప ఆహారమే ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.