Telugu Global
Andhra Pradesh

90 గంటల్లో 1200 కిలోమీటర్లు.. ఏపీ సైక్లిస్ట్‌ల అరుదైన ఘనత!

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అల్ట్రా సైక్లింగ్ పోటీలలో ఒకటైన పారిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ సైక్లిస్ట్ లు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

90 గంటల్లో 1200 కిలోమీటర్లు.. ఏపీ సైక్లిస్ట్‌ల అరుదైన ఘనత!
X

సైక్లింగ్.. సహనం, వేగం, నేర్పు, ఓర్పు, దమ్ముపట్టే శక్తికి పరీక్షగా నిలిచే క్రీడ. సైక్లింగ్ లో ఎన్నో రకాల రేస్‌లు ఉన్నా.. అల్ట్రా సైక్లింగ్ రేస్ ల ప్రత్యేకతే వేరు. సైక్లిస్టుల దమ్ముకు అసలుసిసలు పరీక్ష అల్ట్రా సైక్లింగ్ రేస్ మాత్రమే. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు సమీపంలోని బ్రెస్ట్ సిటీలో 1891 నుంచి రామ్ బౌలెట్ అల్ట్రా సైక్లింగ్ రేస్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. గత 132 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న ఈ రేస్ ల పరంపరలో భాగంగా ఇటీవలే ముగిసిన 2023 రామ్ బౌలెట్ రేస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎనిమిది మంది సభ్యుల బృందం పాల్గొని విజయవంతంగా తిరిగి వచ్చింది. ఈ అల్ట్రా సైక్లింగ్ రేస్ లో ఆంధ్రప్రదేశ్ జట్టులోని తొమ్మిది మందిలో ముగ్గురు సభ్యులు విజయవంతంగా రేస్ ను పూర్తిచేసి రాష్ట్రానికి మాత్రమే కాదు.. దేశానికే గర్వకారణంగా నిలిచారు.

అల్ట్రా సైక్లింగ్ లో ఒలింపిక్స్..

ప్రపంచ వ్యాప్తంగా జరిగే అల్ట్రా సైక్లింగ్ రేస్ లకే రామ్ బౌలెట్ రేస్ ను ఒలింపిక్స్ లాగా పరిగణిస్తారు. సైక్లింగ్ ను క్రీడగా ఎంచుకొనే సైక్లిస్ట్ లు జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ రేస్ లో పాల్గొని సత్తా చాటుకోవాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సైక్లిస్ట్ లు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. పారిస్ నైరుతీ ప్రాంతం నుంచి మొదలై కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెస్ట్ సిటీని చేరి..తిరికి అక్కడ నుంచి పారిస్ నగరానికి చేరడంతో ఈ రేస్ ముగుస్తుంది. అయితే.. అవిశ్రాంతంగా 90 గంటలపాటు సాగే ఈ రేస్ లో 1200 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రేస్ లో 45 ఏళ్ళ బొమ్మారెడ్డి శివకుమార్ రెడ్డి, 42 సంవత్సరాల నర్రా నిషికాంత్, 52 ఏళ్ళ కోలిశెట్టి వెంకట గణేశ్ బాబులతో కూడిన తొమ్మిది మంది సభ్యుల ఏపీ సైక్లిస్ట్ ల బృందం పాల్గొంది. అయితే వీరిలో ముగ్గురు మాత్రమే (శివకుమార్ రెడ్డి,నిషికాంత్,వెంకట గణేశ్ బాబు) మాత్రమే సత్తాకు, సహనానికి పరీక్షగా నిలిచిన ఈ రేస్ ను పూర్తి చేయగలిగారు.

ఎవరి ఏర్పాట్లు వారివే..

90 గంటలపాటు సాగే ఈ మారథాన్ రేస్ లో పాల్గొనే సైక్లిస్ట్ లు తమ ఏర్పాట్లను తాము మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. రేస్ మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి, కునుకుతీసే వెసలుబాటు ఉంటుంది. విశాఖకు చెందిన శివకుమార్ రెడ్డి 86 గంటలపాటు సైకిల్ తొక్కి పతకం సొంతం చేసుకోగలిగాడు. నిషికాంత్ 100 గంటలు, విజయవాడ సైక్లిస్ట్ గణేశ్ బాబు 101 గంటలపాటు సైక్లింగ్ లో పాల్గొని ఓవర్ టైమ్ లిమిట్ ఫినిషర్లుగా నిలిచారు. 200 నుంచి 600 కిలోమీటర్ల చొప్పున అంచలంచెలుగా సాగే ఈ రేస్ లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 7500 మంది సైక్లిస్ట్ లు తలపడ్డారు. మనదేశానికే చెందిన 280 మంది వీరిలో ఉంటే.. ఆంధప్రదేశ్ కు చెందిన సత్యనారాయణ గారపాటి, రమణ కల్లా, వికాశ్ మిశ్రా, శ్రీనివాస్ కిరణ్, రవి యార్గగడ్డ, కిరణ్ రాష్ట్ర‌ బృందంలోని ఇతర సభ్యులలో ఉన్నారు.

డిహైడ్రేషన్, గ్యాస్ సమస్యలు, నిసత్తువ, సుగర్ స్థాయి పడిపోవడం లాంటి సవాళ్లను అల్ట్రా సైక్లిస్ట్ లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ..వివిధ దేశాల నుంచి వచ్చి ఈ రేస్ లో పాల్గొనే సైక్లిస్ట్ లకు దారిపొడుగున్నా ఉన్న ప్రాంతాల ప్రజలు ఆహారం, నీరు, మందులను పంచుతూ తమవంతు సహకారం అందిస్తున్నారు. 90 నుంచి 100 గంటలపాటు సైకిల్ తొక్కిన 45 సంవత్సరాలు పైబడిన ఆంధ్రప్రదేశ్ సైక్లిస్ట్ లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.

First Published:  4 Sept 2023 6:13 PM IST
Next Story