1995లో ఐటీ, 2025లో ఏఐ
బిల్‌గేట్స్‌తో భేటీ అనంతరం చంద్రబాబు ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రో సాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తుచేశారు. దక్షిణ భారత్‌లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వాములు కావాలని కోరారు. సీఈవో హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నస్టిక్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా తరహా హెల్త్ డ్యాష్‌బోర్డుల ఏర్పాటునకు సహకరించాలని కోరారు. బిల్‌గేట్స్ సలహాలు రాష్ట్ర ఐటీ అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. చాలాకాలం తర్వాత చంద్రబాబును కలవడం ఆనందంగా ఉన్నదని ఈ సందర్భంగా బిల్‌గేట్స్ అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బిల్‌గేట్స్‌తో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 1995లో ఐటీ, 2025లో ఏఐ అని పేర్కొన్నారు.