Telugu Global
Andhra Pradesh

అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది.

అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా
X

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఈనెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు ఆయన పర్యటన జూన్ 11వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఆ రోజు జరగబోయే బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.

ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈనెల 10వ తేదీన ఆయన తిరుపతికి రానున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 9 సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు నెలరోజులపాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు.

ఈ మేరకు వరుసగా బీజేపీకి చెందిన అగ్ర నేతలు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అమిత్ షా, జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఇటీవల ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ. పదివేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సహాయం గురించి ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు కూడా కేంద్రం చేసిన సహాయం గురించి ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

First Published:  5 Jun 2023 10:17 PM IST
Next Story