ఏపీలో సం`కుల` సమరం
బీసీలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు పడరాని పాట్లు పడుతున్నాయి. మరోవైపు నిర్ణయాత్మక శక్తిగా మారతాయనుకుంటున్న కాపుల ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు సాగుతున్నాయి.
కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అతి తక్కువ శాతం ఓటింగ్ ఉన్న అగ్రవర్ణాలవారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ నేపథ్యంలో అతి ఎక్కువ శాతం ఓట్లున్న కులాల వైపు రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా 52 శాతంగా ఉన్న బీసీలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు పడరాని పాట్లు పడుతున్నాయి. మరోవైపు నిర్ణయాత్మక శక్తిగా మారతాయనుకుంటున్న కాపుల ఓట్ల కోసం ఎత్తులకు పైఎత్తులు సాగుతున్నాయి. వైసీపీ ఆధ్వర్యంలో బీసీల సదస్సులు నిర్వహించారు. ఇదే సమయంలో టీడీపీ వివిధ బీసీ కులాలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి, వారికి లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసింది. రాజమహేంద్రవరం వేదికగా వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు సమావేశం అయి, తమకు పదవులు ఇచ్చి మేలు చేసిన పార్టీతోనే ఉంటామంటూ నినదించారు.
అయితే కాపుల ఓట్లను గణనీయంగా కొల్లగొట్టే అవకాశం ఉందన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని వీరు టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రియాక్షన్ తాడేపల్లిగూడెం నుంచి వినిపించింది. జనసేన కాపు ప్రతినిధుల సమావేశం తాడేపల్లిగూడెంలో జరిగింది. వైసీపీలో ఉంటూ పవన్‌ను తిట్టేవారు కాపులు కాదు, పాలికాపులు అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కాపు నేతలు భేటీ కావడం ...సం`కుల` సమరం మొదలైందని తేలిపోయింది. ఎన్నికల హీట్‌ని కుల రాజకీయాలు మరింత వేడెక్కించాయి. ఏ పార్టీ ఏ కులానికి ఏం చేసింది? ఏ కులానికి అన్యాయం చేసింది? అనే అంశాలపై ఆరోపణలు, కౌంటర్లతో నేతలు వస్తున్నారు.