అనంతబాబు కేసులో మరో ట్విస్ట్.. రూ.13.30 లక్షలకు సెటిల్మెంట్
ఆ వీడియో చూపించి తన దగ్గర రూ.13.30 లక్షలు కొట్టేశారంటూ బ్యాంకు లెక్కల్ని పోలీసులకు ఆధారాలుగా చూపించారు ఎమ్మెల్సీ అనంతబాబు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ వ్యవహారం ఇటీవల ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియో తనది కాదని అనంతబాబు చెబుతున్నారు. అది మార్ఫింగ్ వీడియో అని, గతంలో తనకు దాన్ని పంపించి బ్లాక్ మెయిల్ చేశారని కూడా అంటున్నారు. అయితే అక్కడితో ఆగకుండా పోలీస్ కేసు పెట్టారు అనంతబాబు. ఆ వీడియో చూపించి తన దగ్గర రూ.13.30 లక్షలు కొట్టేశారంటూ బ్యాంకు లెక్కల్ని పోలీసులకు ఆధారాలుగా చూపించారు. దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.
3 నెల క్రితమే తనను కొంతమంది బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారని అనంతబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని విడతల వారీగా తన వద్ద రూ. 13.30 లక్షలు తీసుకున్నారని కూడా చెప్పారు. అంతే కాదు ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చారు. మే నెలలో కొంత, జూన్ లో మరికొంత.. ఇలా ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో ఆ నగదు తాను జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేశారు. మార్ఫింగ్ వీడియో చూపిస్తే ఆయన అంతలా ఎందుకు భయపడ్డారని, బ్లాక్ మెయిలర్లకు ఎందుకంత డబ్బులిచ్చారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వినపడుతున్నాయి.
అనంతబాబు వ్యవహారంలో వైసీపీ సైలెంట్ గా ఉంది. గతంలో దువ్వాడ శ్రీను పర్సనల్ ఎపిసోడ్ లో కూడా పార్టీ మౌనాన్నే ఆశ్రయించింది. కనీసం దువ్వాడ, అనంతబాబు ఇచ్చిన వివరణలను కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా హ్యాండిళ్లలో కూడా ప్రచురించకపోవడం విశేషం. దువ్వాడ శ్రీను విషయంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అనంతబాబుపై మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా వైసీపీని తీవ్రంగా టార్గెట్ చేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా తెరపైకి తెస్తూ మొత్తంగా పార్టీని బ్లేమ్ చేస్తోంది.
ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించాలనే రూలేమీ లేదు. కానీ పార్టీ నేతలు, అందులోనూ చట్ట సభ సభ్యులు కాబట్టి కచ్చితంగా వారిద్దరిపై పార్టీ స్టాండ్ ఏంటో బహిరంగంగా చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పెద్దల సభకు అలాంటి వారిని పంపిస్తారా అని నిలదీస్తున్నారు కూటమి నేతలు. ప్రస్తుతానికి వైసీపీ మాత్రం వీరి వ్యవహారంలో మౌనాన్నే కొనసాగించడం విశేషం.