అనంతపురం టికెట్.. చంద్రబాబుకు ప్రభాకర్ చౌదరి అల్టిమేటం
2014కు ముందే తనను వైసీపీలోకి రావాలని జగన్ కోరారని.. మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారన్నారు ప్రభాకర్ చౌదరి. అయినప్పటికీ తాను టీడీపీ కోసం కష్టపడి పని చేశానని చెప్పారు.
అనంతపురం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన తెలుగుదేశం నేత ప్రభాకర్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు సరేనంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ప్రభాకర్ చౌదరి. దగ్గుపాటి ప్రసాద్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదన్నారు.
తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలనుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేయాలన్నారు ప్రభాకర్ చౌదరి. దగ్గుపాటికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. దగ్గుపాటి ఏనాడూ పార్టీకోసం పని చేయలేదని.. అలాంటి వ్యక్తికి తానేందుకు సహకరించాలని ప్రశ్నించారు.
2014కు ముందే తనను వైసీపీలోకి రావాలని జగన్ కోరారని.. మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారన్నారు ప్రభాకర్ చౌదరి. అయినప్పటికీ తాను టీడీపీ కోసం కష్టపడి పని చేశానని చెప్పారు. 2014 - 19 మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్ చౌదరి.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ప్రభాకర్ చౌదరిని పక్కనపెట్టిన చంద్రబాబు.. దగ్గపాటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో అనంత టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.