కిరాయి హంతకుల ఆటకట్టు - బెంగళూరు ముఠా.. అనంతలో పట్టివేత
ఈ ముఠాపై బళ్లారి, గోవా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఉండటంతో వీరు అనంతపురం వచ్చినట్టు తెలిసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో రెండింటినీ వేర్వేరు చోట్ల బంకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ తుపాకులన్నీ బీహార్, జార్ఖండ్‌లలో తయారైనవేనని తేలింది.
కిరాయి హంతకుల ఆట కట్టించారు అనంతపురం పోలీసులు. నెలరోజుల క్రితం రాయదుర్గంలో వెలుగులోకి వచ్చిన నకిలీ కరెన్సీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ ముఠా గుట్టు చిక్కింది. తీగ లాగితే డొంకంతా కదిలింది. బెంగళూరు యశ్వంత్ పురా, శివాజీనగర్‌కు చెందిన ఈ ముఠా సభ్యులంతా కిరాయి హంతకులే. వీరంతా పలు హత్య కేసుల్లో నిందితులే. మొత్తం ఏడుగురు సభ్యులతో ఉన్న ఈ ముఠాను అనంతపురం పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఇన్నోవా, బొలేరో వాహనాలతో పాటు ఆరు కంట్రీ మేడ్ తుపాకులు, 35 రౌండ్ల బుల్లెట్లు, 33 కేజీల గంజాయి, రూ.2 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేస్తున్నారు.
నకిలీ కరెన్సీ చెలామణి.. వీరి ప్రధాన ఆదాయ వనరు
ఈ ముఠా సభ్యుల ప్రధాన ఆదాయ వనరు నకిలీ కరెన్సీ చెలామణి చేయడం. రూ.5 లక్షలు చెలామణి చేసిన వారికి రూ.3 లక్షల ఒరిజినల్ కరెన్సీ ఇస్తారు. కర్నాటకలోని బళ్లారి కేంద్రంగా ఈ నకిలీ కరెన్సీని మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ భూస్వామి హత్య కేసులోనూ వీరు నిందితులు. మృతుని కుమారుడు, తమ్ముళ్లే బెంగళూరు ముఠాకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించారు. హత్య అనంతరం బెంగళూరులో మూడు నెలలు జైలుకు వెళ్లిన నిందితులు.. మూడు నెలల క్రితం బెయిలుపై బయటికి వచ్చారు.
గోవాకు మకాం మార్చి...
జైలు నుంచి వచ్చిన అనంతరం తమ మకాం గోవాకు మార్చిన ముఠా సభ్యులు.. అక్కడ కంట్రీ మేడ్ పిస్టళ్లు, నకిలీ కరెన్సీ, గంజాయి వ్యాపారం చేస్తున్నారు. భూస్వామి హత్య కేసులో నిందితుడైన ఆయన కుమారుడు.. బళ్లారిలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బెంగళూరు ముఠా సభ్యులను పిలిపించినట్లు విచారణలో తెలిసింది.
షెల్టర్ కోసమే అనంతపురానికి...
ఈ ముఠాపై బళ్లారి, గోవా ప్రాంతాల్లో పోలీసు నిఘా ఉండటంతో వీరు అనంతపురం వచ్చినట్టు తెలిసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో రెండింటినీ వేర్వేరు చోట్ల బంకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ తుపాకులన్నీ బీహార్, జార్ఖండ్‌లలో తయారైనవేనని తేలింది. వీరు చెలామణి చేస్తున్న నకిలీ కరెన్సీ అంతా రూ.500 నోట్లే. నిందితుల్లో ఒకరిపై 34 కేసులు ఉన్నట్టు తెలిసింది. విచారణ కీలక దశలో ఉన్నందున పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. లోతుగా విచారణ చేస్తే ఈ కేసులో మరింత మంది నిందితులు దొరికే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.