Telugu Global
Andhra Pradesh

వైసీపీలో 60 శాతం మంది ఉండరు- ఆనం కామెంట్స్

నెల్లూరు జిల్లాలో ఫలితాలు గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయని టీడీపీ విజయం సాధిస్తుందని విశ్లేషించారు. తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానన్న ప్రచారం జరుగుతోందని కానీ అలాంటి ఆలోచన తనకు లేదన్నారు.

వైసీపీలో 60 శాతం మంది ఉండరు- ఆనం కామెంట్స్
X

వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీకి శాపనార్థాలు పెడుతున్నారు. పార్టీ నాయకత్వంపై వైసీపీలో విపరీతమైన వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీ నుంచి దాదాపు 60 శాతం మంది ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆనం చెప్పారు. ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్నందున అనేక ఇబ్బందులు వస్తాయనే చాలా మంది వైసీపీలో కొనసాగుతున్నారని వివరించారు. అందుకే ఇప్పటికిప్పుడు చాలా మంది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో ఫలితాలు గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయని టీడీపీ విజయం సాధిస్తుందని విశ్లేషించారు. తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానన్న ప్రచారం జరుగుతోందని కానీ అలాంటి ఆలోచన తనకు లేదన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వివరించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే డిసెంబర్‌లో గానీ లేదా ఏప్రిల్‌లో గానీ ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలో చేతులు కలిపారని చాలా కాలం నుంచే వైసీపీ అనుమానిస్తూ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో ఆయనపై వైసీపీ వేటు వేసింది. వైసీపీ అనుమానం నిజమే అన్నట్టుగా ఆనం మాటలు ఉన్నాయి. ఆయన ఇంకా టీడీపీలో చేరలేదు గానీ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని చెబుతున్నారు. దీన్ని బట్టి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ క్యాంపులో కలిసిపోయినట్టుగానే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వైసీపీలో ఎవరూ ఉండరని విమర్శలు చేస్తుండవచ్చు.

First Published:  23 May 2023 8:18 AM IST
Next Story