దుష్ట చతుష్టయంతో అమిత్ షా పొలిటికల్ గేమ్..
జగన్ వ్యతిరేకులందర్నీ అమిత్ షా కలుస్తూ వెళ్తున్నారు, కలుపుకొనిపోతున్నారు. మరి దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడుని కలిపి దుష్ట చతుష్టయం అంటూ పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు ఏపీ సీఎం జగన్. ఆ దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేసేవారు.
జగన్ చెప్పే ఈ దుష్టచతుష్టయానికి ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీలో చంద్రబాబుని కలిశారు అమిత్ షా. ఇప్పుడు హైదరాబాద్ పర్యటనలో నేరుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటికి వెళ్లబోతున్నారు.
గతంలో రామోజీరావుని, పవన్ కల్యాణ్ ని కూడా అమిత్ షా పలుమార్లు కలసిన ఉదాహరణలున్నాయి. టీవీ-5 యాజమాన్యంపై కూడా బీజేపీకి సింపతీ ఉండే ఉంటుంది. ఇలా జగన్ చెప్పే దుష్టచతుష్టయానికి దగ్గరవుతున్న అమిత్ షా ఏపీలో కొత్త పొలిటికల్ గేమ్ మొదలు పెట్టాలనుకుంటున్నారని తేలిపోయింది.
చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా లేక అమిత్ షా నే గేమ్ ప్లాన్ చేశారా అనేదానిపై వైసీపీలోనే భిన్నవాదనలు వినపడుతున్న వేళ.. అమిత్ షా మాత్రం జగన్ వ్యతిరేకులందర్నీ కలుస్తూ వెళ్తున్నారు, కలుపుకొనిపోతున్నారు. మరి దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
అమిత్ షా, జేపీ నడ్డా.. ఇద్దరూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రెండు రోజులకే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు.. సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పడం విశేషం.
కేంద్రంలోని బీజేపీతో వైసీపీ కోరి గొడవలు పెట్టుకోవడం లేదు, కావాలని విమర్శలు చేయడంలేదు. కానీ బీజేపీ తమలపాకుతో ఒకటి అంటే వైసీపీ తలుపు చెక్కతో రెండు అనడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ గొడవల్ని పెంచేందుకే బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుకే జగన్ ద్వేషించే దుష్టచతుష్టయానికి దగ్గరవుతోంది.