పవన్‌కు షా ‘చెక్’ పెట్టారా?
రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని పవన్ ప్రస్తావించినా ఆ విషయమై మాట్లాడేందుకు అమిత్ షా ఇష్టపడలేదు.
పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసిందా? ఢిల్లీలో జరిగిన చర్చల తీరు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. మొదట్లో రెండు పార్టీలు దేనికదే విడిగా పోటీ చేయాలని అనుకున్నా తర్వాత ఏమైందో ఏమో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాయి. అందుకనే మొదట్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ ఇపుడు 10 సీట్లకు పరిమితమైనట్లు తెలుస్తోంది.
పొత్తు, సీట్ల సర్దుబాటుపై బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పవన్ చర్చలు జరిపారు. తెలంగాణలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని, గురువారానికల్లా సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా సూచించారు. శుక్రవారం తాను హైదరాబాద్ వచ్చేటప్పటికి పొత్తుల విషయమంతా ఫైనల్ అయిపోవాలని చెప్పారు. తెలంగాణ ప్రస్తావన అయిపోగానే పవన్ ఏపీ రాజకీయాల గురించి కూడా అమిత్ షాతో చర్చించారు.
పవన్ చెప్పింది విన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీని అన్నీ విధాలుగా ఆదుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని పవన్ ప్రస్తావించినా ఆ విషయమై మాట్లాడేందుకు అమిత్ షా ఇష్టపడలేదు. పొత్తుల విషయాన్ని పవన్ ప్రస్తావించేందుకు ప్రయత్నించినా అమిత్ షా చెక్ పెట్టేసినట్లు సమాచారం. టీడీపీతో బీజేపీ కలిసి పనిచేసే విషయమై అమిత్ షాను ఒప్పించాలని పవన్ చేసిన ప్రయత్నం ఫెయిలైంది.
అంటే పవన్‌ను అమిత్ షా కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసేశారు. జగన్మోహన్ రెడ్డిపైన ఫిర్యాదు, చంద్రబాబు అరెస్టు విషయం, టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ ప్రస్తావించాలని అనుకున్నా అమిత్ షా పెద్దగా ఎంటర్‌టైన్ చేయలేదు. పవన్ ఏపీలో పరిస్థితులపై ప్రస్తావించగానే ఏపీని తాము అన్నీ విధాలుగా ఆదుకుంటామని చెప్పారంటేనే అర్థమైపోతోంది అమిత్ షా ఉద్దేశం. పవన్ ఉద్దేశం ఏపీని అభివృద్ధి చేయటం కాదు జగన్ పైన ఫిర్యాదులు చేయటం, చంద్రబాబును ఇబ్బందుల్లో నుండి బయటపడేయటమే. పవన్ ఉద్దేశాన్ని గ్రహించారు కాబట్టే అమిత్ షా కూడా చెక్ పెట్టేసినట్లు కనబడుతోంది.