ఏపీ ప్రజలు అంత అమాయకులా..? ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా డబుల్ గేమ్
ధర్మవరం సభలో అమిత్ షా, ముస్లిం రిజర్వేషన్ల గురించి నోరెత్తలేదు. చంద్రబాబు కోసం ఆయన డబుల్ గేమ్ మొదలు పెట్టారు.
తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి అవసరం లేదు. కేవలం హిందూ ఓటు బ్యాంకుపై ధీమాతో అక్కడ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది బీజేపీ. అందుకే తెలంగాణలో జరిగిన ప్రచారంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ధీమాగా ప్రకటించారు అమిత్ షా. ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని చెప్పారు. మరి అదే ధైర్యం ఏపీలో ఎందుకు చేయలేదు. ఏపీలో కూడా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి కదా. ధర్మవరం పర్యటనలో అమరావతి సహా అన్నీ మాట్లాడిన అమిత్ షా.. ముస్లిం రిజర్వేషన్ల గురించి మాత్రం నోరు మెదపలేదు. అంటే ఇది డబుల్ గేమ్ కాదా..?
మైనార్టీలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలన్నదే టీడీపీ, బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రతి మీటింగ్ లో చెప్తున్న బీజేపీ.. ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తులో ఉన్న @ncbn…
— YSR Congress Party (@YSRCParty) May 5, 2024
ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనేది అమిత్ షా స్టేట్ మెంట్. అలా తొలగిస్తామని చెబితే ముస్లింలు వారికి ఓటు వేస్తారా..? తెలంగాణలో ఆ వర్గం ఓట్లు బీజేపీకి అవసరం లేదేమో కానీ, ఏపీలో మాత్రం ముస్లింలు దూరం జరిగితే కూటమి ప్రమాదంలో పడుతుంది. అందుకే ఇక్కడ చంద్రబాబు ముస్లింలను మోసం చేసేందుకు రకరకాల డ్రామాలాడుతున్నారు. సుప్రీంకోర్టులో మంచి లాయర్లను పెట్టి ముస్లిం రిజర్వేషన్లకోసం వాదిస్తానంటున్నారు. వారికి మంచి చేసింది తానేనని చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఎన్డీఏలో కూటమిలో ఉన్న టీడీపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పగలదా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.
వైసీపీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అదే సమయంలో బీజేపీని సైలెంట్ చేస్తే తన వ్యూహం ఫలిస్తుందని అనుకుంటున్నారు. అందుకే ధర్మవరం సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ల గురించి నోరెత్తలేదు. చంద్రబాబు కోసం ఆయన కూడా డబుల్ గేమ్ మొదలు పెట్టారు. ఈ డబుల్ గేమ్ ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఏపీ ప్రజలు. చంద్రబాబుకి ఓటు వేస్తే 4 శాతం రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకున్నట్టేననే విషయం ముస్లింలకు కూడా తెలుసు. అందుకే వారు కూటమికి దూరంగా ఉన్నారు.