పవన్ పై కాపుల అభిమానం మితిమీరి అతి అయిపోయింది
పవన్ ని సీఎం చేయాలని జనసైనికులు భావిస్తుంటే, వారందర్నీ చంద్రబాబుకి కట్టు బానిసలు చేయాలని పవన్ భావిస్తున్నారని కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కాపులు మితిమీరి అతిగా అభిమానిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి అంబటి రాంబాబు. మితిమీరిన అభిమానం కాపు సమాజానికి కీడు చేస్తుందని హెచ్చరించారు. పవన్ కోసం ప్రాణం పెట్టడానికి కాపు సామాజిక వర్గం సిద్దంగా ఉంటే ఆ సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు అమ్మడానికి పవన్ రెడీగా ఉన్నారని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ కొడుకులకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సీఎం పదవి ఇస్తారా అని ప్రశ్నించారు అంబటి.
సైకిల్ తొక్కడానికి కూడా ప్యాకేజీనా..?
చంద్రబాబు పని అయి పోయిందని, సైకిల్ తొక్కే ಓపిక లేక పవన్ ని పిలిచారని, కానీ పవన్ ఆ పనికి కూడా ప్యాకేజీ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. సినీ నటుడిగా కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే పవన్, సైకిల్ తొక్కడానికి కూడా రెమ్యునిరేషన్ కావాలంటున్నారని చెప్పారు. పవన్ ని నమ్మినవారంతా చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్దపడినట్టేనని అన్నారు.
పవన్ ని ఓడించేది చంద్రబాబే..
టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కొనే సందర్భంలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు దగ్గరకు తీశారని, అవసరం తీరాక వారిని దూరం పెట్టారని చెప్పారు అంబటి. చంద్రబాబు ఊసరవెల్లి అని అవసరం తీరిన తర్వాత తొక్కేయడం ఆయన నైజమని తెలిపారు. అలాంటి చంద్రబాబు, పవన్ ని సీఎం చేస్తాడని అనుకోవడం కలేనని అన్నారు. పవన్ ని సీఎం చేయాలని జనసైనికులు భావిస్తుంటే, వారందర్నీ చంద్రబాబుకి కట్టు బానిసలు చేయాలని పవన్ భావిస్తున్నారని కౌంటరిచ్చారు. సీఎం పదవికోసం పవన్ కల్యాణ్ ఆశపడితే, కనీసం ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా చంద్రబాబు అడ్డుపడతారని చెప్పారు. ఎన్టీఆర్ కొడుకులనే పక్కనపెట్టిన చంద్రబాబు, తన అవసరం తీరాక పవన్ ని సైతం తొక్కేస్తారని, ఇంత చిన్న లాజిక్ జనసేన నేతలు ఎలా మిస్ అయ్యారో తనకు అర్థం కావడంలేదన్నారు.