Telugu Global
Andhra Pradesh

ఇక అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్...!

భారత మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకొన్నాడు. ఇక తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు....

ఇక అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్...!
X

భారత మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకొన్నాడు. ఇక తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు....

గత దశాబ్దకాలంగా తన క్రికెట్ ఇన్నింగ్స్ తో భారత, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులను అలరించిన తెలుగుతేజం, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన రాజకీయ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ పార్టీలో చేరాడు.

జగన్ సమక్షంలో......

గత సీజన్ ఐపీఎల్ తో తన క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు గుంటూరు పట్టణపరిసర ప్రాంతాలలో గత కొద్దిమాసాలుగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోడం ద్వారా అధికారికంగా తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ టికెట్ మీద ఎంపీ స్థానం కోసం రాయుడు పోటీకి దిగే అవకాశం ఉంది.

2013 నుంచి 2019 వరకూ...

గుంటూరు జిల్లాకు చెందిన అంబటి తిరుపతి రాయుడు హైదరాబాద్ లో జన్మించి ప్రతిభావంతుడైన క్రికెటర్ గా ఎదిగాడు. కేవలం 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే హైదరాబాద్ జట్టు సభ్యుడిగా తన తొలి ఫస్‌ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడటం ద్వారా భారత క్రికెట్ లోకి దూసుకొచ్చాడు.

అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొన్న భారత జూనియర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

2013 నుంచి 2019 మధ్యకాలంలో భారతజట్టుకు 61 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో రాయుడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక సభ్యుడిగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకొన్నాడు.

2023 సీజన్ తోనే ఐపీఎల్ నుంచి రిటైరవుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. మేజర్ క్రికెట్ లీగ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కు ఆడిన రాయుడు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

వివాదాలకు చిరునామా....

అంబటి రాయుడికి క్రికెటర్ గా అపారప్రతిభ మాత్రమే కాదు..దుందుడుకు స్వభావం, ఆవేశపరుడిగా కూడా పేరుంది. 2002 సీజన్లో ఇండియా- ఏ జట్టులో చోటు సంపాదించడం ద్వారా సత్తా చాటుకొన్న రాయుడు 2004 ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు.

అయితే..సహ ఆటగాళ్ళు, క్రికెట్ సంఘాలతో విభేదాల కారణంగా హైదరాబాద్, ఆంధ్ర, బరోడా క్రికెట్ సంఘాల నడుమ తిరుగుతూ వచ్చాడు. నిలకడలేమితో భారతజట్టులో కుదురుకోలేకపోయాడు.

తగిన అవకాశాలు లేకపోడం, హైదరాబాద్ క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయిన రాయుడు ఇండియన్ క్రికెట్ లీగ్ లో చేరటం ద్వారా భారత క్రికెట్ కు సైతం దూరమయ్యాడు. అయితే బీసీసీఐ క్షమాభిక్ష పథకం ప్రకారం తిరిగి జాతీయ క్రికెట్ స్రవంతిలో చేరగలిగాడు. 2009 నుంచి బరోడా జట్టులో సభ్యుడుగా రంజీమ్యాచ్ లు ఆడిన రాయుడు ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఫ్రాంచైజీ తరపున పాల్గొనే అవకాశం దక్కించుకొన్నాడు.

ఐపీఎల్ తో దశతిరిగిన రాయుడు...

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడుగా రాయుడు నిలకడగా రాణించడం ద్వారా తిరిగి భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. 2013 జింబాబ్వే పర్యటన ద్వారా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం రాయుడు చేతికి అందినట్లే అంది జారిపోయింది. భారతజట్టులో చోటు దక్కక పోడంతో అంతర్జాతీయ క్రికెట్ కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించాడు. ఐస్ లాండ్ క్రికెట్ నుంచి అవకాశం వచ్చినా రాయుడు తిరస్కరించాడు.

2019 జులైలో రిటైర్మెంట్ ....

2019 జూలైలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరతున్నట్లు రాయుడు అధికారికంగా ప్రకటించాడు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే మే 28న

ఐపీఎల్ కు సైతం గుడ్ బై చెప్పాడు.

2023 జూన్ 29న మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కు ఆడుతున్నట్లు ప్రకటించాడు. అయితే మేజర్ లీగ్ రాయుడు విషయంలో మూడుమ్యాచ్ ల ముచ్చటగా ముగిసిపోయింది.

ఆ తర్వాత వైసీపీలో చేరడం ద్వారా ప్రజాసేవ చేయాలని రాయుడు నిర్ణయించుకొన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దానికితోడు వైసీపీ అధ్యక్షుడు

జగన్మోహన్ రెడ్డిన సైతం రాయుడు కలుసుకోడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

చివరకు..2023 డిసెంబర్ 28న రాయుడు వైసీపీలో చేరుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభమైనట్లయ్యింది.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, పడుతున్న శ్రమను చూసి తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నట్లు రాయుడు ప్రకటించాడు.

గుంటూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి రాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  29 Dec 2023 1:00 PM IST
Next Story