పాపం అంబటి రాయుడు.. రెండు రోజులు బానిసగా బతకాల్సి వచ్చింది
జగన్ దగ్గరకొచ్చిన రెండు రోజులకే రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తర్వాత జనసేనలోకి వెళ్లారు. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు.. అంతవరకు ఓకే..
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో హడావుడి చేస్తున్నారు. ముందు వైసీపీలో చేరతానని వచ్చి, రెండు రోజులు తిరగకుండానే తూచ్ కాదని తనకు నిలకడ లేదని చాటుకున్న రాయుడు తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తర్వాత ఇప్పుడు జనసేనలో చేరానంటూ కండువా మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆయన వైసీపీలో బానిసత్వం భరించలేక ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చేశానంటూ ఒకే డైలాగ్ పదేపదే చెబుతుండటం చూసి జనం నవ్వుకుంటున్నారు.
అంతా హైదరాబాద్‌లోనే.. ఇప్పుడు ఆంధ్ర మీద ప్రేమ!
రాయుడు గుంటూరు ప్రాంతంవాడు కావచ్చేమో కానీ అతని కుటుంబమంతా హైదరాబాద్‌లోనే స్థిరపడింది. ఏనాడూ తనకు ఆంధ్రప్రదేశ్ మూలాలున్నాయని ఏనాడూ చెప్పుకోలేదు. ఆ మాటకొస్తే అతను ఆంధ్ర రంజీ టీమ్‌కు కూడా ఆడలేదు. హైదరాబాద్ తరఫునే రంజీలు ఆడాడు. తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైనా కొన్నాళ్ల తర్వాత టీమ్‌లోకి తీసుకోవడం మానేశారు. ఐపీఎల్‌లో ధోనీ, సచిన్‌ల పుణ్యమా అని కొన్నాళ్లు లాక్కొచ్చాడు. అక్కడా తనకు పెద్ద వాల్యూ లేని అర్థమయ్యాక రాజకీయాల బాటపట్టాడు.
గుంటూరు ఎంపీ టికెట్ కావాలని వచ్చి..
వైసీపీలో చేరతానని వచ్చిన అంబటి రాయుడు ఏకంగా గుంటూరు ఎంపీ టికెట్ కావాలని తన మనసులో మాట బయటపెట్టాడు. అసలే గుంటూరు సీటు వైసీపీకి ప్రతిష్టాత్మకం. గత ఎన్నికల్లో సునామీ వైసీపీ సృష్టించినా గుంటూరు, విజయవాడ పార్లమెంట్ సీట్లను కొట్టలేకపోయామని జగన్ ఈసారి వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే గుంటూరులో క్యాండేట్ ఎవరనేదానిపై గట్టి కసరత్తే చేశారు. గుంటూరులో పోటీ చేయమంటే కాదన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి గట్టి అభ్యర్థి పార్టీ వీడిపోయినా వదిలేసుకున్నారంటే గుంటూరుపై జగన్ దృష్టి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో రాయుడు గుంటూరు ఎంపీ సీటు అంటే కుదరదని పార్టీ పెద్దలు చెప్పేశారు.
రెండు రోజుల్లోనే బయటికి
జగన్ దగ్గరకొచ్చిన రెండు రోజులకే రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తర్వాత జనసేనలోకి వెళ్లారు. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు.. అంతవరకు ఓకే.. కానీ, రాష్ట్రంలో రాజకీయ నాయకుల మాదిరిగా తాను కూడా జగన్‌ను విమర్శిస్తేనే ఎల్లో మీడియాలో వస్తాననుకున్నాడో ఏమో కానీ ఓ అరిగిపోయిన డైలాగు అందుకున్నాడు. వైసీపీలో బానిసత్వం భరించలేకే బయటికొచ్చేశాడట. రెండు రోజులు కూడా లేని పార్టీలో ఆయనేం బానిసత్వం అనుభవించాడట అని వైసీపీ వాళ్లే కాదు జనసేన కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు.