Telugu Global
Andhra Pradesh

ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పూర్తి సమయం రాజకీయాల్లోనేనా?

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. అందుకు రాజకీయాలే సరైన వేదిక అని గతంలో వెల్లడించాడు.

ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పూర్తి సమయం రాజకీయాల్లోనేనా?
X

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ రోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అలహాబాద్‌లో జరుగనున్న ఫైనల్‌ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అంటూ ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ సారి వెనక్కు తిరిగేదే లేదని చెప్పాడు. గతంలో ఒక సారి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు.. ఆ తర్వాత ఆ ప్రకటనను వెనక్కు తీసుకొని క్రికెట్ ఆడాడు. ఈ సారి మాత్రం 'యూ టర్న్' తీసుకునేది లేదని స్పష్టం చేశాడు.

'ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అనే రెండు గొప్ప జట్లకు ఆడాను. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 14 సీజన్లకు గాను 204 మ్యాచ్‌లు ఆడాను. 11 ప్లేఆఫ్స్.. 8 ఫైనల్స్.. 5 ట్రోఫీలు ఉన్నాయి. ఈ రాత్రి 6వ ట్రోఫీ సాధిస్తానని అనుకుంటున్నాను. నా క్రికెట్ ప్రయాణం చాలా హాయిగా సాగిపోయింది. ఈ రాత్రి ఫైనల్ మ్యాచ్.. నా కెరీర్‌లో చివరి ఐపీఎల్ గేమ్ అవుతుంది. ఈ టోర్నీని ఆసాంతం ఆస్వాదించాను. ఈ సారి మాత్రం వెనక్కి తిరగను' అంటూ ట్విట్టర్‌లో అంబటి రాయుడు రాసుకొచ్చాడు.

అంబటి రాయుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే తన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. అందుకు రాజకీయాలే సరైన వేదిక అని గతంలో వెల్లడించాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తరచూ ట్విట్టర్ వేదికగా పొగుడుతున్నాడు. దీంతో ఆయన వైసీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.

అంబటి రాయుడు వైసీపీలో చేరితే ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరితే.. స్టార్ క్యాంపెయినర్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. అంబటి రాయుడు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నది. గుంటూరు జిల్లాలో రాయుడికి మంచి స్నేహాలు, బంధుత్వాలు కూడా ఉన్నాయి.


First Published:  28 May 2023 6:39 PM IST
Next Story