లెక్కలు తేలుస్తా 'బ్రో'.. ఢిల్లీకి అంబటి
'బ్రో' సినిమాకు డబ్బులు ఏ రూపంలో వచ్చాయి, ఎలా వచ్చాయి, పవన్ రెమ్యునరేషన్ ఎంత, అందులో వైట్ ఎంత..? బ్లాక్ ఎంత..? తేల్చాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.
'బ్రో'.. సినిమాని, పవన్ కల్యాణ్ ని ఓ పట్టాన వదిలేలా లేరు మంత్రి అంబటి రాంబాబు. అమెరికాలో చంద్రబాబు వసూలు చేసిన డబ్బులు.. 'బ్రో' సినిమాకోసం దొడ్డిదారిన ఇక్కడకు తెచ్చారని ఆరోపించిన అంబటి రాంబాబు.. ఆ లెక్కలు తేల్చేందుకు ఢిల్లీ బయలుదేరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆయన ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.
ఢిల్లీకి వెళ్లిన తర్వాత ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని ఇతర ఎంపీలను మంత్రి అంబటి రాంబాబు కలుస్తారు. వారితోపాటుగా ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలను కలసి 'బ్రో' సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేసే అవకాశముంది. ఆ సినిమాకు డబ్బులు ఏ రూపంలో వచ్చాయి, ఎలా వచ్చాయి, పవన్ రెమ్యునరేషన్ ఎంత, అందులో వైట్ ఎంత..? బ్లాక్ ఎంత..? తేల్చాలంటూ అంబటి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. శ్యాంబాబు పాత్ర ద్వారా తనను కించపరచిన పవన్ కల్యాణ్ ని అంబటి వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు ఆయన అనుచరులు.
'బ్రో' నిర్మాత కౌంటర్లు..
సినిమాపై మంత్రి అంబటి చేసిన ఆరోపణలపై 'బ్రో' మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ పరోక్షంగా స్పందించారు. సినిమాకోసం డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని, ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీశారనే విషయాన్ని తాను ఎవరికి చెప్పాల్సిన పని లేదన్నారు. నిర్మాణ సహభాగస్వామిగా ఉన్న జీ నెట్ వర్క్ కి, తనకి తప్ప ఆ విషయం ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. అది పవన్ కి, తమ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ అని వివరణ ఇచ్చారు. ప్రపంచంలో ఎవరికీ దాని గురించి అగిడే హక్కు లేదని, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆ విషయం పవన్ చూసుకుంటారని చెప్పుకొచ్చారు నిర్మాత విశ్వ ప్రసాద్. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా శ్యాంబాబు అంశంపై సెటైర్లు వేశారు. అప్పుడెప్పుడో ఆనందం సినిమాలో రాంబాబు అనే పాత్ర ఉందని, అది కూడా ఈయన గురించే అని అంటే కష్టమని అన్నారు. సినిమాని కేవలం సినిమాలాగా చూడాలని, రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నారు సాయి ధరమ్ తేజ్.