గాడిదలా మోయడమే పవన్ పని –అంబటి సెటైర్లు
పవన్ కల్యాణ్ కాపులకు పట్టిన శని అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. వారాహి అని కాకుండా వాహనం పేరు పంది అని పెట్టుకోమనండి అంటూ సెటైర్లు పేల్చారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన మరోసారి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఊహించినట్టుగానే వైసీపీనుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ధూళిపాళ్లలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్, వైసీపీని విమర్శించినట్టే కనిపించినా.. ఆయన ఇచ్చిన సందేశం వేరని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని, బీజేపీకి ఇన్ డైరెక్ట్ గా పవన్ మెసేజ్ పంపించారని అన్నారు. చంద్రబాబును గెలిపించటానికి తాను గాడిదలా మోస్తానని అన్నారని, జనసైనికులు కూడా తన లాగే గాడిదలా చంద్రబాబుని గెలిపించే బరువు మోయాలని చెబుతున్నారని ఈ వ్యూహాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు అంబటి.
ఆయనకు విడిపోవడం అలవాటే..
పవన్ కల్యాణ్ కి విడిపోవడం అలవాటేనంటూ మరోసారి ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. ఆయన ఇప్పటికే చాలామందితో విడిపోయారని, ఇప్పుడు బీజేపీతో విడిపోవడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. అధికారం దక్కని కులాలను అధికారంలోకి తీసుకు రావటమే జనసేన లక్ష్యమని చెబుతున్న పవన్ అదే మాటపై నిలబడతారా లేక, చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకొని పొత్తులతో సర్దుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు.
రాజకీయ సన్యాసం ఏమైంది పవన్..?
2019లో జగన్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న పవన్ కల్యాణ్, ఆ వాగ్దానం ఏమైందో చెప్పాలన్నారు. తాను 2లక్షల రూపాయల లంచం తీసుకున్నట్టు పవన్ నిరూపించగలిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు అంబటి.
ఆయన శని, ఆయన వాహనం పంది..
పవన్ కల్యాణ్ కాపులకు పట్టిన శని అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. పోలవరం పూర్తి చేయనంత మాత్రాన తాను మంత్రి పదవికి అర్హుడిని కానా? అని ప్రశ్నించారు. 2018లో చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చారు కదా, అప్పుడెందుకు ఆయన్ని నిలదీయలేదని అన్నారు. నీ జామకాయ నీ ఇష్టం, అంతే కానీ, కాపులందరినీ గాడిదల్ని చేయాలనుకోవద్దు అంటూ పవన్ కి చురకలంటించారు. వారాహి అని కాకుండా వాహనం పేరు పంది అని పెట్టుకోమనండి అంటూ సెటైర్లు పేల్చారు.
కౌలు రైతు కుటుంబాలకు సాయం చేస్తున్నానని చెబుతున్న పవన్ కల్యాణ్, కౌలు రైతు గుర్తింపు కార్డులు ఉన్న అసలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబాలకు తమ ప్రభుత్వం రూ. 7 లక్షల నష్టపరిహారం అందజేస్తోందని గుర్తు చేశారు. పవన్ సాయం చేస్తున్నవారు గుర్తింపు కార్డులు ఉన్న కౌలు రైతులు కాదన్నారు.