వారాహి యాత్ర + యువగళం = వరాహగళం
అవనిగడ్డలో పవన్ రోడ్ షో ఫ్లాప్ షో అని అన్నారు అంబటి. అవనిగడ్డ "వరాహగళం" ఫ్లాప్ అయిందని ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత ఈరోజు మొదలైంది. గతంలో జరిగిన మూడు విడతల్లో కేవలం జనసైనికులే ఈ యాత్రకు హాజరయ్యారు. టీడీపీ అనుకూల మీడియా యాత్రను కవర్ చేసినా, అది కొంతమేరకే ఉండేది. కానీ నాలుగో విడత విషయంలో టీడీపీ కూడా యాత్రకు బహిరంగంగా మద్దతు తెలిపింది. టీడీపీ అనుకూల మీడియా కూడా పవన్ ని భుజానికెత్తుకుంది. ఈ సందర్భంగా వారాహి తాజా షెడ్యూల్ పై మంత్రి అంబటి రాంబాబు పంచ్ లు విసిరారు. వారాహి యాత్ర +యువగళం = వరాహగళం అంటూ ట్వీట్ వేశారు. వారాహి వాహనంపై మొదటినుంచీ అంబటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరాహగళం అంటూ మరోసారి సెటైర్లు పేల్చారు అంబటి.
వారాహి యాత్ర +యువగళం = వరాహగళం @naralokesh @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023
1+1 = 0
ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలతో తమకు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, జనసేన కలసినా కూడా ఇబ్బందేమీ లేదన్నారు. లెక్కల్లో 1+1 = 2 అవుతుందని, కానీ కొన్నిసార్లు రాజకీయాల్లో 1+1 = 0 అవుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలసినా కూడా ఫలితం లేదన్నారు. ఆ రెండు పార్టీలు కలసినా రిజల్ట్ గుండు సున్నా అంటూ సెటైర్లు పేల్చారు అంబటి. అవనిగడ్డలో పవన్ రోడ్ షో ఫ్లాప్ షో అని అన్నారు అంబటి. అవనిగడ్డ "వరాహగళం" ఫ్లాప్ అయిందని ట్వీట్ చేశారు.
టీడీపీ, జనసేన కలయిక ముందుగా ఊహించిందేనని అంటున్నారు వైసీపీ నేతలు. గతంలో లోపాయికారీగా కలసి ఉన్నారని, జైలు ములాఖత్ తర్వాత అది బహిరంగం అయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత టీడీపీ ప్రచార కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయి. పవన్ యాత్ర మాత్రం మొదలైంది. ఈ దశలో పవన్ యాత్రపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. యువగళం ఆగిపోవడంతో వారాహి యాత్ర "వరాహగళం"గా మారిందని అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు.