Telugu Global
Andhra Pradesh

ఆ ముగ్గురు పొలిటికల్ బఫూన్స్.. అంబటి హాట్ కామెంట్స్

చంద్రబాబు ఎన్నో కుటుంబాల దీపాల్ని ఆర్పేశారని.. అలాంటి వ్యక్తి కోసం కొత్తగా దీపాల్ని ఆర్పడం ఎందుకని ప్రశ్నించారు మంత్రి అంబటి.

ఆ ముగ్గురు పొలిటికల్ బఫూన్స్.. అంబటి హాట్ కామెంట్స్
X

నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురూ ఏపీలో పొలిటికల్ బఫూన్స్ లా మారారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. వీళ్ల మాటలు కామెడీగా ఉంటాయని, ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదన్నారు. అవనిగడ్డ మీటింగ్ లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పిన పవన్, ఆ తర్వాత మీటింగ్ లో ఎన్డీఏలోనే ఉన్నానని అంటున్నారని, ఆయనకయినా కనీసం క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై ఇంటింటికీ ప్రచారం చేస్తానని నారా లోకేష్ అంటున్నారని, వీరిద్దరికీ ఇప్పుడు బాలకృష్ణ జతకలిశారని.. ఈ ముగ్గురు పొలిటికల్ బఫూన్స్‌ లా మారారని మంత్రి అంబటి విమర్శించారు.

దీపాలార్పడమేంటి కామెడీగా..?

క్రాంతి - కాంతి అంటూ టీడీపీ మరో వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా.. రాత్రి 7 గంటలకు అందరూ లైట్లు ఆపేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు లోకేష్. ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి, బయటకొచ్చి కొవ్వొత్తులు, టార్చి లైట్లు,సెల్ ఫోన్ లైట్లు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంపై మంత్రి అంబటి సెటైర్లు పేల్చారు. చంద్రబాబు ఎన్నో కుటుంబాల దీపాల్ని ఆర్పేశారని.. అలాంటి వ్యక్తి కోసం కొత్తగా దీపాల్ని ఆర్పడం ఎందుకని ప్రశ్నించారు.

ఆ తేడా గమనించు పవన్..

పవన్ కల్యాణ్ వారాహి యాత్రలు ఫ్లాప్ అయ్యాయని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీతో పొత్తు ప్రకటన వెలువడకముందు పవన్ యాత్రలు ఎలా జరిగాయి..? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి..? జనం ఎందుకు తగ్గారు..? అనే విషయాలపై పవన్ దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. పవన్, చంద్రబాబు పొత్తుని ప్రజలు అంగీకరించడం లేదన్నారు. ఆ రెండు ఓట్లు కలిసేలా లేవని చెప్పారు. చంద్రబాబు చేసిన స్కాంలపై విచారణ జరుగుతోందని, ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. అవినీతితో అరెస్టు అయిన వ్యక్తికి పవన్ మద్దతు ఇవ్వడం వెనక కారణం లంచాల్లో వాటానే అని వివరించారు. రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుందన్నారు మంత్రి అంబటి.


First Published:  7 Oct 2023 3:38 PM IST
Next Story