బఫూన్లే పార్టీలు మారతారు.. అంబటి హాట్ కామెంట్స్
నారా లోకేష్ బయట తిరుగుతుంటే టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే ఆయన్ను మాయం చేసి దాచి పెట్టారని సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు. లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని అన్నారు.
ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఎన్నికల వేళ ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద వైరి వర్గాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీలో టికెట్లు దొరకని కొందరు నేతలు పార్టీలు మారుతున్న విషయంపై కూడా అంబటి ఘాటుగా స్పందించారు. బఫూన్లే పార్టీలు మారతారని చెప్పారు. ఎంపీ బాలశౌరి అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ అని ఎద్దేవా చేశారు. ఆయన ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తారని అన్నారు అంబటి.
సీట్ల ముష్టికోసం బాబు ఇంటికి..
చంద్రబాబు విదిల్చే సీట్ల ముష్టికోసమే పవన్ కల్యాణ్ ఆయన ఇంటికి వెళ్లారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌ను నమ్ముకుంటే జనసైనికులు కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టేనని చురకలంటించారు. ఇప్పటికైనా జనసేన నేతలు, కార్యకర్తలు నిద్ర మేల్కోవాలన్నారు. పవన్ తో ఉండాలో వద్దో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
లోకేష్ ని మాయం చేసింది అందుకే..
నారా లోకేష్ బయట తిరుగుతుంటే టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే ఆయన్ను మాయం చేసి దాచి పెట్టారని సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు. లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా జగన్ చరిత్రలో జగన్ నిలిచిపోతారని, మేనిఫెస్టోని మాయం చేసిన ఘనడిగా చంద్రబాబుకి కూడా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని ఎద్దేవా చేశారు. దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ అని కితాబిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను వైసీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు అంబటి.