Telugu Global
Andhra Pradesh

వైసీపీలో అసమ్మతి సెగ.. ఈసారి అంబటి వంతు

మంత్రి అంబటి తమను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనం పెరిగిందని, స్థానిక ప్రజాప్రతినిధులైన తమను విస్మరించి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీలో అసమ్మతి సెగ.. ఈసారి అంబటి వంతు
X

సార్వత్రిక ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండటంతో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఒక్కో దఫా మంత్రులకు సైతం అసమ్మతి సెగలు తప్పడంలేదు. ఇటీవలే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రూపంలో ఆటంకం ఎదురైనా, సీఎం జగన్ ఆ గొడవకు ముగింపు పలికారు. ఇప్పుడు మరో మంత్రి అంబటి రాంబాబుకి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. అంబటి ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని అసమ్మతి వర్గం ప్రత్యేక సమావేశం పెట్టుకుని విమర్శలు చేసింది. సత్తెనపల్లిలో గ్రూపు రాజకీయాలను తారాస్థాయికి చేర్చింది.

సత్తెనపల్లి వైసీపీలో గ్రూపు రాజకీయాలు చాన్నాళ్ల క్రితమే బయటపడ్డాయి. అంబటిపై చిట్టా విజయ భాస్కర్ రెడ్డి వర్గం కత్తులు నూరుతోంది. స్థానికేతరుడైన అంబటికి వచ్చేదఫా సత్తెనపల్లి టికెట్ ఇవ్వొద్దని వారు అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఒకవేళ అంబటికే టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామంటున్నారు. 2024 ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ ఇప్పటికే చిట్టా విజయ భాస్కర్ రెడ్డి ప్రకటించుకున్నారు. గతంలో రెండుసార్లు అసమ్మతి వర్గాన్ని కూడగట్టిన చిట్టా.. ఈసారి కూడా తనవర్గం సర్పంచ్ లు, ఎంపీటీసీలను ఇంటికి పిలిపించుకుని బలప్రదర్శన చేపట్టారు.

అసమ్మతి నేతలు తాజాగా చిట్టా విజయభాస్కర్‌ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. వైసీపీకి చెందిన 11 మంది సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి అంబటి తమను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనం పెరిగిందని, స్థానిక ప్రజాప్రతినిధులైన తమను విస్మరించి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదైనా ప్రజా సమస్యపై మంత్రిని కలవాలని ప్రయత్నించినా కుదరటం లేదన్నారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై అంబటి ఇంకా స్పందించలేదు. ఈ వ్యవహారంలో సీఎం జగన్ జోక్యం చేసుకుంటారా లేక ఇన్ చార్జ్ లకు వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  19 July 2023 4:10 PM GMT
Next Story