అంగడి సరుకు 'బ్రో'.. అంబటిలో తగ్గని ఫ్రస్టేషన్
మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకం రేపాయి. పవన్ ని అంగడి సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్ర మంత్రి అంబటి రాంబాబుని బాగానే ఇబ్బంది పెట్టినట్టుంది. సినిమా విడుదలైన తర్వాత ట్వీట్ వేసి, ఆ తర్వాత ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చిన మంత్రి రాంబాబు.. తాజాగా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పవన్ అంగడి సరుకు అని, ఎవరైనా ఆయన్ను కొనుక్కోవచ్చని దుయ్యబట్టారు.
అంగట్లో సరుకు..
"అంగట్లో సరుకు, అమ్మడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు. ఎవరు కావాలంటే వారు కొనుక్కోవచ్చు. బీజేపీ వాళ్లు కొనుక్కోవచ్చు, టీడీపీ వాళ్లు కొనుక్కోవచ్చు, ఆమధ్య బీఆర్ఎస్ కూడా బేరం ఆడిందట. ఆయన్ను కొనుక్కోని, ఆయన భుజాలపై ఎక్కి చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు రావాలనుకుంటున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.." అంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకం రేపాయి. పవన్ ని అంగడి సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
సత్తెనపల్లి మళ్లీ నాదే..
సత్తెనపల్లి మళ్లీ తనదేనంటూ ఘంటాపథంగా చెబుతున్నారు మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లోకేష్ టీడీపీకి పట్టిన శని అన్నారు. టీడీపీ వాళ్లకు ఆ విషయం అర్థమైతే చాలన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ తప్ప ఇంకెవరూ లేరన్నారు అంబటి. బీసీలకు పిలిచి పదవులు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు.