Telugu Global
Andhra Pradesh

మా పార్టీలో నెంబర్2, 3 లేరు.. ఆయనే నెంబర్ 1

వైసీపీలో ఎవరూ నెంబర్-2 లు లేరని, టీడీపీలో ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. టీడీపీలో నెంబర్1, 2 ఉన్నారని, బయటి వ్యక్తి నెంబర్-3 గా ఉన్నారని ఎద్దేవా చేశారు.

మా పార్టీలో నెంబర్2, 3 లేరు.. ఆయనే నెంబర్ 1
X

వైసీపీలో నెంబర్2, నెంబర్ 3 అంటూ ఎవరూ లేరని, జగన్ ఒక్కరే నెంబర్-1 అని చెప్పారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. ఆయన చెప్పిన పనిని చిత్తశుద్ధితో చేయడమే తమ కర్తవ్యం అన్నారు. ఈనాడులో వైసీపీ అంతర్గత వ్యవహారాలపై వస్తున్న వార్తల్ని అంబటి ఖండించారు. తమ పార్టీపై గతంలో కూడా కుట్రలు జరిగాయని, వాటన్నిటినీ ఛేదించుకుని నిలబడ్డామన్నారు.


గతంలో రామోజీరావు, ఇప్పుడు ఆయన తనయుడు కిరణ్.. ఇద్దరూ వైసీపీని టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. వైసీపీలో ఎవరూ నెంబర్-2 లు లేరని, టీడీపీలో ఉంటారని చెప్పుకొచ్చారు. టీడీపీలో నెంబర్1, 2 ఉన్నారని, బయటి వ్యక్తి నెంబర్-3 గా ఉన్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఒక్కరే నాయకుడని అన్నారు. తమ పార్టీని నలిపేద్దామని, చిదిపేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం అది వృథా ప్రయాసేనని అన్నారు అంబటి.

తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని అన్నారు అంబటి. కక్ష సాధింపు చర్యలకు దిగినా.. తమ పార్టీలో ఎవ్వరూ భయపడబోరని తేల్చి చెప్పారు. గతంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి విషయంలో ఇప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజదొంగల్ని, టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసినట్టు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వందలమంది పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారని, తీరా ఏపీకి వచ్చాక 41ఏ నోటీసులిచ్చి వదిలిపెట్టారని ఎద్దేవా చేశారు. పిలిస్తే ఆయన వచ్చేవారు కదా అని ప్రశ్నించారు. ప్రజలు టీడీపీని చీదరించుకోవడం ప్రారంభించారన్నారు అంబటి.

First Published:  31 July 2024 9:16 AM IST
Next Story