Telugu Global
Andhra Pradesh

మళ్లీ మొదలైన అమరావతి ఆందోళ‌న‌.. నేడు సైకిల్ ర్యాలీ, 12 నుంచి పాదయాత్ర

అమరావతి కథ కంచికి పోలేదు, అలాగని ఎక్కడా ఆగలేదు.

మళ్లీ మొదలైన అమరావతి ఆందోళ‌న‌.. నేడు సైకిల్ ర్యాలీ, 12 నుంచి పాదయాత్ర
X

అమరావతి కథ కంచికి పోలేదు, అలాగని ఎక్కడా ఆగలేదు. ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి వెనక్కు తగ్గనంటుంది, అదే సమయంలో అమరావతి రైతులు ఏకైక రాజధానికోసం చేసే పోరాటం ఆపబోమంటున్నారు. అసెంబ్లీలో బిల్లు పెడతారని ఏ చిన్న అనుమానం వచ్చినా, ఎక్కడ ఏ వార్త గుప్పుమన్నా అమరావతి రైతులు ఆందోళనపడిపోతున్నారు. తాజాగా గుంటూరులో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈనెల 12నుంచి పాదయాత్ర మొదలవుతుందని అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయేతర జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు..?

ఈనెల చివరి వారంలో ఏపీ అసెంబ్లీ జరగబోతోంది. కేబినెట్ భేటీలో మూడు రాజధానుల బిల్లుపై నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి పక్కాగా, కోర్టులు కూడా అడ్డు తగల్లేని విధంగా బిల్లు ఉండాలని సూచించారట జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా హింటిచ్చారు. దీంతో సహజంగానే అమరావతి పరిరక్షణ సమితి నాయకుల్లో ఆందోళన మొదలైంది. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం అంటూ ఏపీ హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించిన రైతులు.. ఇప్పుడు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

సెప్టెంబర్ 12న మొదలు..

ఈ ఏడాది సెప్టెంబర్ 12నాటికి అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులు పూర్తవుతుందని, ఆ సందర్భంగా పాదయాత్ర మొదలు పెడతామని అంటున్నారు జేఏసీ నాయకులు. తాజాగా అసెంబ్లీలో బిల్లు పెడతారనే వార్తల నేపథ్యంలో గుంటూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బిల్డ్‌ అమరావతి-సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు నాయకులు. హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ఏపీ మంత్రుల్లో కొందరు మూడు రాజధానులపై మాట్లాడుతున్నారని అన్నారు.

First Published:  4 Sept 2022 12:19 PM IST
Next Story