Telugu Global
Andhra Pradesh

30 నెలల్లో అమరావతి నిర్మాణం.. అయ్యే పనేనా?

సీడ్ క్యాపిటల్‌లోని నిర్మాణాలకు మొదట ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐతే నిధుల సమీకరణ ప్రధాన సవాల్‌. కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏ మేరకు సహకరిస్తుందనేది అనుమానమే.

30 నెలల్లో అమరావతి నిర్మాణం.. అయ్యే పనేనా?
X

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో ఏపీ ప్రజలు రాజధానిగా అమరావతికే జైకొట్టినట్లు స్పష్టమైంది. ఇక ఉత్తరాంధ్ర ప్రజలు సైతం విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదని తేలిపోయింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అమరావతి నిర్మాణంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అమరావతి నిర్మాణ బాధ్యతలు గతంలో పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణకే అప్పగించారు.


తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. 30 నెలల్లోగా అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం‌ పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. పాత మాస్టర్ ప్లాన్‌తోనే ముందుకు సాగుతామన్నారు. సీడ్ క్యాపిటల్‌లోని నిర్మాణాలకు మొదట ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐతే నిధుల సమీకరణ ప్రధాన సవాల్‌. కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఏ మేరకు సహకరిస్తుందనేది అనుమానమే. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న టైంలోనూ ప్రధాని మోదీ.. రాజధాని కోసం పైసా కూడా ప్రకటించలేదు. దానిపై ఇప్పటికీ సెటైర్లు పేలుతున్నాయి.


రాబోయే రెండు నెలల్లో అమరావతి ప్రస్తుత పరిస్థితిపై రివ్యూ చేసి ఓ అంచనాకు వస్తామన్నారు మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతంలో మిస్‌ అయిన లేదా దొంగిలించబడ్డ సామగ్రి, విలువైన వస్తువులపై విచారణ ఉంటుందన్నారు. అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో పెద్దగా నిర్మాణాలు జరగలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ మినహా దాదాపు మిగిలిన అన్ని భవనాలు అసంపూర్తిగా నిర్మాణమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందా అంటే అనుమానమే.

First Published:  16 Jun 2024 6:17 AM GMT
Next Story