అమరావతిపై జగన్ ముద్ర.. జులై-8న పేదల ఇళ్లకు శంకుస్థాపన
అమరావతిలో ఆర్-5 జోన్ వ్యవహారం సుఖాంతమైంది. ప్రతిపక్షాలకు మాత్రం అది మింగుడుపడని వ్యవహారంలా మారింది. ఆ పుండుపై మరింత కారం చల్లేలా జులై -8న అమరావతిలో పేదల ఇళ్లకు సామూహిక శంకుస్థాపనలు జరగబోతున్నాయి.
అమరావతిలో ఆర్-5 జోన్ వ్యవహారం సుఖాంతమైంది. ప్రతిపక్షాలకు మాత్రం అది మింగుడుపడని వ్యవహారంలా మారింది. ఆ పుండుపై మరింత కారం చల్లేలా జులై -8న అమరావతిలో పేదల ఇళ్లకు సామూహిక శంకుస్థాపనలు జరగబోతున్నాయి. మొత్తం 47వేల ఇళ్లకు శంకుస్థాపనలు చేయబోతున్నట్టు తెలిపారు ఏపీ గృహనిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్.
అమరావతిపై జగన్ ముద్ర..
ఇప్పటి వరకూ అమరావతి అంటే చంద్రబాబు కట్టించిన తాత్కాలిక సచివాలయం, హైకోర్టు నిర్మాణాలే గుర్తుస్తాయి. ఇంకొన్ని చోట్ల మొండిగోడలు మిగిలాయి. ఇప్పుడు జగన్ బ్రాండ్ అమరావతిలో కనపడేలా పేదల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అమరావతిలో 47వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం వచ్చే నెల 8న సామూహిక శంకుస్థాపనల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతోంది.
ఇప్పటికే సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికాగా.. ఇంటి నిర్మాణాలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. అమరావతి కమ్మవారి గేటెడ్ కమ్యూనిటీ అని ఇన్నాళ్లూ విమర్శిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం, అక్కడ అందరికీ ఇళ్లు కట్టించి.. అమరావతి అందరిదీ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు మంజూరు చేశారు. శుక్రవారం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిపి శంకుస్థాపన పనులకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు.
అమరావతి పేదల కాలనీలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామంటున్నారు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్. దశలవారీగా 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారాయన. అంటే సార్వత్రిక ఎన్నికలనాటికి అమరావతిపై జగన్ ముద్ర బలంగా పడుతుందని తేలిపోయింది.