తగ్గేదే లేదు.. హద్దు రాళ్లు పీకేసిన అమరావతి రైతులు
హైకోర్టు ఇచ్చింది కేవలం మధ్యంతర ఉత్తర్వులు, మరోవైపు సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని రైతులు సవాల్ చేశారు. త్వరలో విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా పట్టాల పంపిణీ జరిగిపోవాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం.
అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం మరోసారి గొడలకు కారణమయ్యేలా ఉంది. అక్కడ స్థానికేతరులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చంటూ ఇటీవల ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే కోర్టు తుది తీర్పుకి లోబడి పట్టాల పంపిణీ ఉండాలని సూచించింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్ల పట్టాల పంపిణీలో వేగం పెంచింది. R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 1134 ఎకరాలను చదును చేయిస్తూ లే అవుట్లు వేస్తోంది. స్థానికులు కొందరు ఈ లే అవుట్ రాళ్లను పీకేశారు. కురగల్లులో హద్దురాళ్లను తొలగించడంతో కలకలం రేగింది.
ఎందుకంత తొందర..?
హైకోర్టు ఇచ్చింది కేవలం మధ్యంతర ఉత్తర్వులు, మరోవైపు సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని రైతులు సవాల్ చేశారు. త్వరలో విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా పట్టాల పంపిణీ జరిగిపోవాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం. రైతులు ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అంత తొందర ఎందుకంటున్నారు.
తగ్గేదే లేదు..
ఈనెల 15న అమరావతిలో పట్టాల పంపిణీకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి, కురగల్లు నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెంలో భూమిని చదును చేశారు. హద్దురాళ్లు పాతారు. త్వరలోనే CRDA పరిధిలో కేటాయించిన ఈ భూముల్లో గుంటూరు, విజయవాడ పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే కురగల్లులో హద్దురాళ్లు తొలగించడంతో కలకలం రేగింది. కేవలం హద్దురాళ్ల తొలగింపుతో స్థానికులు ఆగుతారా, లేక అధికారులకు అడ్డుపడతారా అనేది తేలాల్సి ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే, టీడీపీకి ఎందుకు కడుపుమంట అంటూ ఇప్పటికే అధికారపక్షం విమర్శలు చేస్తోంది. ఈ దశలో స్థానికులు హద్దురాళ్లు పీకేయడం, ప్రభుత్వం పట్టుదలకు పోవడంతో.. ఇది మరో గొడవకు దారితీస్తుందనే అనుమానాలున్నాయి. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు తగ్గేదేలేదంటున్నాయి.