పర్చూరు నుంచి పోటీ చేయాలని ఆమంచి డిసైడ్ అయ్యారా.?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు చెంచురాముకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చీరాల నుంచి పోటీ చేయడానికి చెంచురాము రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..వైసీపీలో తలనొప్పిగా మారిన చీరాల టికెట్ వ్యవహారం తెలుగుదేశం నిర్ణయంతో తీరిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం రాష్రమంతా వీచినా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం సత్తా చాటింది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత బలరాం టీడీపీని వీడి వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన బదులు తన కొడుకు కరణం వెంకటేశ్‌కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసిన ఆమంచిని వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరింది. ఈ మేరకు నియోజకవర్గం మారి పని చేసుకోవాలని సూచించింది.
స్వయంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చెప్పినా సరే ఆమంచి మాత్రం చీరాలను వీడటానికి ఇష్టపడటం లేదు. ఎలాగైనా చీరాల నుంచే పోటీ చేసి తీరతానని ప్రకటించారు. దీంతో అక్కడ ఆమంచి వర్సెస్ కరణంలా వ్యవహారం మారిపోయింది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులతో చెప్పారు. ఈ వ్యవహారం ఇక కొలిక్కి వచ్చేలా లేదని వైసీపీ అధిష్టానం కూడా వదిలేసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమంచి సొంతగా తన అనుచరులను నిలబెట్టి 11 వార్డుల్లో గెలిపించుకున్నారు. దీంతో ఆమంచి ఇక చీరాలను వీడేది లేదని అందరూ డిసైడ్ అయ్యారు.
కాగా, ఇప్పుడు ఆమంచి పర్చూరు నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు టీడీపీ తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు చెంచురాముకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చీరాల నుంచి పోటీ చేయడానికి చెంచురాము రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆమంచి, చెంచురాము ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. దీంతో అతడిపై తాను పోటీ చేయకూడదని భావిస్తున్నారు. తన వ్యాపార భాగస్వామికి వ్యతిరేకంగా తాను పోటీ చేయడం బాగోదని.. అందుకే పర్చూరుకు వెళ్లిపోదాని అనుకుంటున్నారు. అవసరం అయితే రాజకీయ అరంగేట్రం చేస్తున్న చెంచురాముకు తన వంతు సాయం కూడా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల కరణం వర్గంపై పై చేయి సాధించడంతోపాటు తన స్నేహితుడిని కూడా గెలిపించుకున్నట్లు అవుతుందని ఆమంచి భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం ఓ పెద్ద తలనొప్పి తీరిపోయిందని అనుకుంటోంది.