కాపు నేతలకు బిగ్ రిలీఫ్
ప్రభుత్వం కేసులను ఉపసంహరించటం, జీవో విడుదల చేయటం వంటి వాటిపై విచారణలో చర్చకు వచ్చింది. దీంతో అన్నీ విషయాలను పరిశీలించిన జడ్జీలు 30 మందిపైన ఉన్న కేసులను కొట్టేశారు.
కాపు నేతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల బిగ్ రిలీఫ్ దొరికింది. కాపు ఉద్యమ సమయంలో అమలాపురం పట్టణ పోలీసుస్టేషన్ ముట్టడికి సంబంధించి చాలామంది కాపు నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టింది. మొదట్లో అరెస్టయినా తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. కేసు విచారణ నిమిత్తం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇలా కోర్టుల చుట్టు తిరుగుతున్ననేతల్లో ముద్రగడ పద్మనాభం, తాతాజీ, ఆకుల రామకృష్ణ, నల్లా పవన్ కుమార్ వంటి 30 మంది ఉన్నారు.
2019లో జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ తదితరులు కేసులను కొట్టేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు. దాంతో వీళ్ళ కేసు వివరాలను పరిశీలించిన ప్రభుత్వం వీళ్ళపై ఉన్న కేసులను 2022, ఫిబ్రవరిలో ఉపసంహరించుకుంది. ఈ మేరకు జీవో విడుదల కూడా చేసింది. అయితే ప్రభుత్వం కేసులను ఎత్తేసినా కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. వీళ్ళపై కేసులను ఉపసంహరించుకున్న విషయాన్ని తర్వాత ప్రభుత్వం కోర్టుకు కూడా తెలిపింది.
తాజాగా అంటే గురువారం ఈ కేసు అమలాపురం కోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వం కేసులను ఉపసంహరించటం, జీవో విడుదల చేయటం వంటి వాటిపై విచారణలో చర్చకు వచ్చింది. దీంతో అన్నీ విషయాలను పరిశీలించిన జడ్జీలు 30 మందిపైన ఉన్న కేసులను కొట్టేశారు. కేసుల ఉపసంహరణ ముందు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకే వెళ్ళినా పిటీషనర్ల రిక్వెస్టు కారణంగా అమలాపురం కోర్టుకు బదిలీ అయ్యింది. తాజాగా వీళ్ళందరిపైన ఉన్న కేసులను కోర్టు కొట్టేసింది. ఏళ్ల తరబడి విచారణను ఎదుర్కొంటున్న కాపునేతలంతా ఇప్పుడు పెద్ద రిలీఫ్‌గా ఫీలవుతున్నారు.
గతంలో చంద్రబాబు హయాంలోనే తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగలబడిన ఘటనలో నమోదైన కేసులను కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వందల మంది మీద నమోదైన కేసులను ఎత్తేసింది. ఎందుకంటే పలానా వాళ్ళే రైలును తగలబెట్టారన్న సాక్ష్యాలను టీడీపీ ప్రభుత్వం, రైల్వేశాఖ కోర్టులో చూపించలేకపోయాయి. మొత్తానికి జగన్ ప్రభుత్వం కేసులు ఎత్తేయటంతో కాపు నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ డెవలప్‌మెంట్ వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయంలో చర్చలు మొదలయ్యాయి.