తెలుగు హీరో కాదు, కాపు హీరో.. రగులుతున్న సోషల్ మీడియా
పుష్ప... అదో సినిమానా..? పుష్ప రాజ్.. స్మగ్లర్ ఒక హీరోనా..? స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారా..? అల్లు అర్జున్ ని మించినోళ్లు ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో లేరా..?
ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ గర్వించదగ్గ సందర్భం ఇది. కానీ అందరూ సంతోషంగా లేరు, కొంతమంది రగిలిపోతున్నారు. తెలుగు హీరోకు అవార్డు రావడం వరకు ఓకే కానీ, ఆ అవార్డు అల్లు అర్జున్ కి రావడమే కొంతమందికి కంటగింపుగా మారింది. అల్లు అర్జున్ పుష్పలో చేసిన నెగెటివ్ రోల్ కి అవార్డు రావడమేంటి..? అనే లాజిక్ కేవలం బయటకు చెబుతున్న కారణం. కానీ లోపల వేరే ఉంది. అది రగులుతూనే ఉంది. అదే సామాజిక వర్గం. ఆ వర్గం అల్లు అర్జున్ పై అక్కసు వెళ్లగక్కుతోంది.
తెలుగు సినిమా పుట్టుకకు కారణం మేమే, దాని ఎదుగుదలకూ కారణం మేమే.. అని ఇప్పటికీ ఓ వర్గం గర్వంగా చెప్పుకుంటుంది. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చే వరకు బయట సామాజిక వర్గాలనుంచి ఆ స్థాయికి ఎదిగిన హీరోలెవరూ లేరు. మెగాస్టార్ ఎంట్రీ తర్వాతే పరిస్థితిలో మార్పులొచ్చాయి. టాలెంట్ తో పాటు కావాల్సిన కులం కార్డుకి కాలం చెల్లింది. ఇండస్ట్రీలో ఉండేదంతా టాలెంటే కదా, కులం కాదు కదా అంటే.. దానికి సమాధానం చాలామంది బాధితులకు తెలుసు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర్నుంచి, సీనియర్ నటుల వరకు ఏదో ఒక సందర్భంలో ఆ ఇబ్బంది పడినవారే.
అవకాశాల వరకు ఓకే కానీ, అవార్డు, అందులోనూ జాతీయ అవార్డు తమ వర్గం వారికి రాకుండా వైరి వర్గానికి రావడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అక్కసు అంతా సోషల్ మీడియాలో కనపడుతోంది. తెలుగు హీరోకి అవార్డు వచ్చిందన్న సంతోషం, వాడు మనోడు కాదు అని తెలిసే సరికి కొంతమందిలో ఆవిరైపోయింది. వాట్సప్ స్టేటస్ లలో ఆ విద్వేషం ప్రతిబింబించింది.
పుష్ప... అదో సినిమానా..?
పుష్ప రాజ్.. స్మగ్లర్ ఒక హీరోనా..?
స్మగ్లర్ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారా..?
అల్లు అర్జున్ ని మించినోళ్లు ఎవరూ తెలుగు ఇండస్ట్రీలో లేరా..?
ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే.. ఈ ప్రశ్నలడిగేవారిలో నూటికి 80శాతం మంది ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందినవారు. మిగతా 20శాతం మంది వారి ఇన్ ఫ్లూయెన్స్ తో కామెంట్లు పెట్టేవారు. స్మగ్లర్ సినిమా చూడ్డానికి టికెట్లు కొని మరీ థియేటర్ కి వెళ్లిన వాళ్లు, ఆ సినిమాకి అవార్డు వస్తే మాత్రం ఎందుకు వంకలు పెడతారు. ఎట్టకేలకు తెలుగు సినిమాలకు, తెలుగు హీరోకి గుర్తింపు వచ్చిందని సంబరపడే సందర్భంలో ఈ విద్వేషాలెందుకు..? కాపు హీరోకి అవార్డు వస్తే కడుపు మంట అంత ఎందుకు..?