పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
పవన్ కోసం కేవలం ట్విట్టర్ మెసేజ్ తో సరిపెట్టిన అల్లు అర్జున్, తన స్నేహితుడికోసం నేరుగా నంద్యాలలో ల్యాండ్ అయ్యారు. అంటే ఇక్కడ బన్నీ ప్రయారిటీ ఏంటో స్పష్టంగా తెలుస్తోంది.
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కి షాకిచ్చారు అల్లు అర్జున్. తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు బన్నీ. తన భార్యతో కలసి నంద్యాలలోని శిల్పా రవిచంద్రారెడ్డికి ఇంటికి వెళ్లారాయన. ఆయన చేయి పట్టుకుని ప్రజలకు అభివాదం చేశారు. తన స్నేహితుడిని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశించారు. తన స్నేహితుడు ప్రజల కోసం కష్టపడే నాయకుడని చెప్పారు అల్లు అర్జున్.
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం!
— YSR Congress Party (@YSRCParty) May 11, 2024
నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న @SilpaRaviReddy కి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చిన @alluarjun#AlluArjunAtNandyal#AlluArjunWithYSRCP#YSRCPWinning#VoteForFan#YSJaganAgain pic.twitter.com/Kn8qnsTvpm
2019 ఎన్నికల సమయంలో కూడా తన స్నేహితుడు శిల్పా రవికోసం నంద్యాల వచ్చారు అల్లు అర్జున్. ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్ గట్టిగా పోరాటం చేస్తున్నారు. పిఠాపురంలో ఆయన నేరుగా పోటీ చేస్తుంటగా, ఆయన పార్టీ జనసేనతో పొత్తులో ఉన్న కూటమి అధికారం కోసం ఎదురు చూస్తోంది. ఈ దశలో పవన్ కి తన మద్దతు ఉంటుందని ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టిన అల్లు అర్జున్, స్నేహితుడి కోసం మాత్రం నేరుగా ఆయన ఇంటికే రావడం గమనార్హం. ప్రచారం చివరి రోజున బన్నీ చేసిన పనికి జనసైనికులు షాకయ్యారు. వైసీపీ అభ్యర్థికి నేరుగా బన్నీ మద్దతుగా రావడంతో రగిలిపోతున్నారు.
అటు పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకోసం చెమటోడుస్తున్నారు. జబర్దస్త్ నటులతోపాటు మెగా ఫ్యామిలీ సభ్యుల్లో ఒక్కొక్కరినీ రంగంలోకి దింపుతున్నారు. చిరంజీవి వీడియో సందేశంతో సరిపెట్టగా, రామ్ చరణ్ నేరుగా పిఠాపురానికి వచ్చారు. పుష్పతో పానిండియా స్టార్ కావడంతోపాటు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కూడా పిఠాపురం వస్తారేమోనని జనసైనికులు ఎదురు చూశారు. కానీ ఆయన కేవలం ట్విట్టర్ మెసేజ్ తో సరిపెట్టారు. తన స్నేహితుడికోసం మాత్రం నేరుగా నంద్యాలలో ల్యాండ్ అయ్యారు. అంటే ఇక్కడ బన్నీ ప్రయారిటీ ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. మొత్తమ్మీద అల్లు అర్జున్ రాకతో నంద్యాల సందడిగా మారింది. వైసీపీ కార్యకర్తలు కూడా బన్నీ తమవాడేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు, జనసైనికులకు చురకలంటిస్తున్నారు.