భూమా అఖిలప్రియ అరెస్ట్
సుబ్బారెడ్డి ఫిర్యాదుతో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దాడి కేసులో ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల మండలం కొత్తపల్లె వద్ద భూమా అఖిల ప్రియ అనుచరులు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. కింద పడేసి కొట్టారు. ఆ సమయంలో భూమా అఖిలప్రియ అక్కడే ఉన్నారు. అనుచరులను ఉసిగొల్పారు. గాయపడిన సుబ్బారెడ్డిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి ఆయన అనుచరులు తరలించారు. నారా లోకేష్, అఖిలప్రియ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇంతకాలం కనిపించని నువ్వు ఇప్పుడెందుకు వచ్చావంటూ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడిచేశారు.
సుబ్బారెడ్డి ఫిర్యాదుతో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దాడి కేసులో ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు అనుచరులనూ అరెస్ట్ చేసి వారిని నంద్యాల తరలించారు. ఆరేళ్లుగా వీరి మధ్య గొడవలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆస్తుల విషయంలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి కొన్ని ఆస్తులను సుబ్బారెడ్డి పేరున ఉంచారని వాటిని తిరిగి అప్పగించడం లేదన్నది అఖిలప్రియ ఆరోపణ. అలాంటి ఆస్తులేమీ లేవన్నది సుబ్బారెడ్డి వాదన.
కొద్దికాలం క్రితం ఏకంగా సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త కలిసి ప్లాన్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. హత్య చేసేందుకు సిద్ధమైన ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది. ఈ విషయంలోనూ భూమా అఖిలప్రియ దంపతులపై కేసు నమోదు అయింది.