Telugu Global
Andhra Pradesh

ఆళ్ల ఘాటు వ్యాఖ్యలు.. ఇప్పటికైనా వైసీపీ మౌనం వీడేనా..?

మంగళగిరి అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని చెప్పి లోకేష్ కి ఓ ఆయుధాన్ని కూడా అందించారు. ఆళ్ల ఇంతగా ఓపెన్ అయిన తర్వాత ఇంకా వైసీపీ మౌనంగా ఉంటుందనుకోలేం. మరి ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

ఆళ్ల ఘాటు వ్యాఖ్యలు.. ఇప్పటికైనా వైసీపీ మౌనం వీడేనా..?
X

ఏపీలో ఎన్నికలకు టైమ్ ముంచుకొస్తోంది. వైసీపీలో రోజుకో సంచలనం నమోదవుతోంది. కానీ ఆ పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. పోయినోళ్లు అందరూ నమ్మకద్రోహులు, పార్టీని నమ్ముకుని ఉన్నోళ్లు మాత్రమే నిజాయితీ పరులు అని స్టేట్మెంట్లిస్తోంది. టికెట్ ఇవ్వలేం కానీ, పార్టీలోనే ఉండండి అని చెబితే వినే నాయకులు ఈరోజుల్లో ఉన్నారా..? లేరు కనుకే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. వెళ్లినోళ్లు సైలెంట్ గా ఉంటే పర్వాలేదు. లొసుగులన్నీ బయట పెడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా నోరు విప్పారు. రాజీనామా చేసినరోజుకంటే ఈరోజు మరింత ఘాటుగా మాట్లాడారు.

నిధులివ్వకపోతే నేనేం చేయాలి..?

మంత్రి పదవిలో ఉండి పోటీ చేసిన నారా లోకేష్ ని సైతం ఓడించిన తనకి కూడా పార్టీ సహకారం అందించలేదని వాపోయారు ఆళ్ల. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లు మాత్రమే కేటాయించారని వివరించారు. తన సొంత డబ్బుతోపాటు, రూ.8కోట్లు అప్పు చేసి మరీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేశానన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానని చెప్పారు. ఆయన చెప్పేవన్నీ నిజాలు అనుకోలేం కానీ, సహకార నిరాకరణ అనేది మాత్రం చాలా నియోజకవర్గాల్లో స్పష్టంగా కనపడుతోంది. నిధులు లేక, నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక చాలామంది ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.

ఎక్కడున్నా వైఎస్ కుటుంబంతోనే..

తాను వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగన్ అయినా, షర్మిల అయినా అంతా వైఎస్ కుటుంబమేకదా అని లాజిక్ చెప్పారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరిస్తే.. ఆమె వెంటే తాను నడుస్తానని అన్నారు ఆర్కే. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీకి సేవచేసి సర్వస్వం పోగొట్టుకున్నానని అన్నారు.

వైసీపీపై కూడా కేసులు వేస్తా..!

చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే.. కేసులు వేసేందుకు వెనకాడనన్నారు. తప్పులు ఎవరు చేశారనేది న్యాయస్థానాలు తేలుస్తాయన్నారు. తనకు మంగళగిరి టికెట్ ఇవ్వట్లేదనే కోపంతో పార్టీని వీడలేదని.. పొమ్మన లేక పొగపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ఆళ్ల, షర్మిల పార్టీకి ఫిక్స్ అయ్యారు. పరోక్షంగా ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తారనే విషయాన్ని కూడా కన్ఫామ్ చేశారు. మంగళగిరి అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం చిన్నచూపు చూసిందని చెప్పి లోకేష్ కి ఓ ఆయుధాన్ని కూడా అందించారు. ఆళ్ల ఇంతగా ఓపెన్ అయిన తర్వాత ఇంకా వైసీపీ మౌనంగా ఉంటుందనుకోలేం. మరి ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  30 Dec 2023 12:25 PM IST
Next Story