అందరి కళ్ళు రాప్తాడు పైనేనా..?
మేనిఫెస్టోలో హామీలిస్తే జగన్ అమలుచేస్తారనే నమ్మకం జనాల్లో ఉంది. పోయిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో చాలావరకు జగన్ అమలుచేశారు.
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో భారీ బహిరంగసభకు వైసీపీ సిద్ధమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ బహిరంగసభను నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయ్యింది. బహిరంగసభ ఏర్పాట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. లోకల్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి+పెద్దిరెడ్డి కలిసి భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. రాప్తాడు బహిరంగసభను ఇంత పెద్దస్థాయిలో ఎందుకు ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహిస్తున్నట్లు..? ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోను ఇక్కడే జగన్ రిలీజ్ చేయబోతున్నారట.
ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాబోయే ఎన్నికల్లో జనాలకు ఇవ్వబోయే హామీలను జగన్ మేనిఫెస్టో రూపంలో ప్రకటించబోతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా మ్యానిఫెస్టో రిలీజ్ కోసం ప్రత్యేకంగా బహిరంగసభలు నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే పద్దతిలో 2024 ఎన్నికల మేనిఫెస్టోను కూడా జగన్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, మహిళలకు ప్రత్యేక హామీలు (ఉచిత బస్సు ప్రయాణం), పెన్షన్ రూ. 4 వేలకు పెంచటం లాంటివి ఉండబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇలాంటి హామీలు నిజంగానే మేనిఫెస్టోలో పెడితే ప్రతిపక్షాలకు పెద్ద షాక్ కొట్టినట్లే.
ఎందుకంటే.. మేనిఫెస్టోలో హామీలిస్తే జగన్ అమలుచేస్తారనే నమ్మకం జనాల్లో ఉంది. పోయిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో చాలావరకు జగన్ అమలుచేశారు. మద్యనిషేధం లాంటి ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చిన జగన్ అమలులో ఫెయిలయ్యారు. అలాగే ఉద్యోగుల పెన్షన్ విధానంలో కూడా మాటిచ్చి తప్పారు. సీపీఎస్ ను రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని అమలుచేస్తానని చెప్పారు. అయితే ఈ హామీని ఇచ్చేముందు ఎలాంటి ఆర్థికపరమైన కసరత్తు చేయలేదు. అందుకనే పెన్షన్ విషయంలో లోతులు తెలుసుకోకుండానే హామీ ఇచ్చారు. ఏదేమైనా మాటిచ్చి ఫెయిలైనట్లుగానే అనుకోవాలి.
ఇలాంటి రెండు మూడు హామీల విషయాన్ని వదిలేస్తే మిగిలిన హామీలను అమలుచేశారు. అందుకనే జగన్ కూడా పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలుచేసినట్లు చెప్పుకుంటున్నారు. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వరస్ట్ ట్రాక్ రికార్డుంది. అందుకనే జగన్ రిలీజ్ చేయబోతున్న మేనిఫెస్టోలో ఎలాంటి హామీలుండబోతున్నాయన్న విషయంపై ఆసక్తితో జనాలు రాప్తాడు బహిరంగసభ వైపు చూస్తున్నారు.