Telugu Global
Andhra Pradesh

సూత్రధారులంతా పరారీలో ఉన్నారా?

పరారీలో ఉన్న వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా పార్టీలను పెట్టారు. బంధువులు, స్నేహితులు అందరి ఇళ్ళల్లోనూ గాలిస్తున్నారు. పరారీలో ఉన్న సూత్రధారులంతా రేపటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీకి రెడీ అవుతున్న అభ్యర్థులు.

సూత్రధారులంతా పరారీలో ఉన్నారా?
X

పుంగనూరు అల్లర్లకు బాధ్యులైన తెలుగుదేశం పార్టీ కీలక నేలంతా పరారీలో ఉన్నారు. ఈనెల 3వ తేదీన చంద్రబాబునాయుడు పుంగనూరు టౌన్లోకి ప్రవేశించాలని ప్రయత్నించినప్పుడు ఘ‌ర్ష‌ణ జ‌రిగిన‌ విషయం తెలిసిందే. ఎలాగైనాసరే పుంగనూరులోకి ప్రవేశించాలని చంద్రబాబు తన మద్దతుదారులతో ప్రయత్నించారు. టౌన్లోకి చంద్రబాబు ఎంటర్ కాకుండా పోలీసులు గట్టిగా ప్రతిఘటించారు. వీళ్ళకి మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తోడయ్యారు. ఆ సమయంలోనే పోలీసులు, వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడులు చేశారు.

ఆ దాడుల్లో సుమారు 20 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. రణధీర్ అనే కానిస్టేబుల్‌ కంటిచూపు కోల్పోయాడు. మూడు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే కొందరు వైసీపీ కార్యకర్తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన యుద్ధం తర్వాత చంద్రబాబు వెళిపోయారు. తర్వాత నుండి పోలీసులు వీడియో సాక్ష్యాల ఆధారంగా దాడులు చేసిన వారిని వెతకటం మొదలుపెట్టారు. దాంతో పార్టీలో కీలక నేతలు, దాడులకు సూత్రధారులు పరారైపోయారు.

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకారం ఉద్రిక్తతలకు పుంగనూరు ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి(చల్లాబాబు), పలమనేరు ఇన్‌చార్జి అమర్నాథ‌రెడ్డి, పీలేరు ఇన్‌చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు ఇన్‌చార్జి గంటా నరహరి, చిన్నబాబు తదితరులు సూత్రధారులు. వీళ్ళంతా ముందుగానే మాట్లాడుకుని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు చల్లాబాబు పీఏ గోవర్ధన ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేసులు పెట్టారు. అల్లర్లు జరిగిన తర్వాత నుండి వీళ్ళంతా పుంగనూరులో కానీ తమ ఊర్లలో కానీ కనబడకుండా మాయమైపోయారు.

పరారీలో ఉన్న వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా పార్టీలను పెట్టారు. బంధువులు, స్నేహితులు అందరి ఇళ్ళల్లోనూ గాలిస్తున్నారు. పరారీలో ఉన్న సూత్రధారులంతా రేపటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీకి రెడీ అవుతున్న అభ్యర్థులు. వీడియో సాక్ష్యాలతో పోలీసులు వీళ్ళపై కేసులు పెడితే చంద్రబాబు మాత్రం తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు ఎదురు దాడులకు దిగారు. అధికారంలోకి రాగానే అధికారుల కథ‌ చెబుతానని చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తమపైనే దాడులు చేసి హత్యకు కుట్రలు చేసిన తమ్ముళ్ళపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. దొరికితే వీళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో చూడాలి.

First Published:  9 Aug 2023 5:39 AM GMT
Next Story